Site icon NTV Telugu

భారత్‌లో రష్యా అధ్యక్షుడి పర్యటన ఖరారు

రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన భారత పర్యటన ఖరారైంది. భారత్- రష్యా దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సమావేశంలో భాగంగా వచ్చే నెల 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి రానున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భేటీలో ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించనున్నట్లు తెలిపింది. అలాగే ఇరుదేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు కూడా భేటీ కానున్నట్లు పేర్కొంది.

Read Also: కొత్త వేరియంట్ దెబ్బ… రూ.7.45 లక్షల కోట్లు ఆవిరి

ఈ సమావేశంలో హిందూ మహాసముద్రం, ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల్లో పురోగతి, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతో పాటు ఈ సమావేశంలో పలు ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేయనున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత రష్యా ప్రెసిడెంట్‌కు ఇది రెండో విదేశీ పర్యటన కాగా.. రెండోసారి భారత్‌కు రానున్నారు. 2018లో చివరిసారిగా భారత్‌లో పర్యటించిన పుతిన్.. ప్రధాని మోదీని కలిసి రెండు దేశాల మధ్య పలు రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాగా ఈ భేటీలో క్షిపణి విధ్వంసక వ్యవస్థ S-400 సరఫరాపై ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version