Russia attacks on Ukraine targeting power system: రష్యా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ముఖ్యంగా ఆ దేశ విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో తీవ్రంగా దాడులు చేస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉక్రెయిన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు విద్యుత్ వ్యవస్థలను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో మూడింట ఒక వంతు విద్యుత్ వ్యవస్థ నాశనం అయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ వెల్లడించారు. తమ విద్యుత్ వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆయన మంగళవారం అన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఉక్రెయిన్ ఖార్కీవ్ ప్రాంతాన్ని రష్యా నుంచి స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. ప్రస్తుతం రష్యా చేస్తున్న దాడుల కారణంగా రాజధాని కీవ్ తో పాటు పలు నగరాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యుత్, నీరు అంతరాయానికి, శీతాకాలం పరిస్థితులకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయ డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో వెల్లడించారు.
Read Also: Pakistan: భారత్‌కు ఇచ్చిన ధరకే మాకు ఇస్తే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాం
మంగళవారం తెల్లవారుజామున కీవ్, ఖార్కీవ్, డ్నిప్రో, జైటోమిర్ ప్రాంతాలపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అంధకారం నెలకొంది. ఆస్పత్రులు జనరేటర్ల సహాయంతో నడుస్తున్నాయి. రష్యా దాడులను తీవ్రవాద దాడులుగా అభివర్ణించారు జెలన్ స్కీ. అక్టోబర్ 10 నుంచి రష్యా దాడుల్లో 30 శాతం పవర్ స్టేషన్లు నాశనం అయ్యాయి. దేశవ్యాప్తంగా బ్లాక్ అవుట్ ఏర్పడింది.
ఇటువంటి పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలకు స్థానం లేదని జెలన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ రెండవ పెద్ద పట్టణం అయిన ఖార్కీవ్ పై రష్యా ఎనిమిది క్షిపణులతో దాడులు చేసింది. కీవ్ నగరంలో మౌళిక సదుపాయాలను నాశనం చేసింది రష్యా. మంగళవారం జరిగిన దాడుల్లో మొత్తం ముగ్గురు చనిపోయారు. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న ఆత్మాహుతి డ్రోన్లతో రష్యా, ఉక్రెయిన్ లో విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ హీటింగ్, ఎలక్ట్రిక్ వ్యవస్థను ప్రణాళికలో భాగంగా ధ్వంసం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్ కు చెందిన షాహెద్-136 డ్రోన్లను 38ని కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది.