Putin: ఉక్రెయిన్‌లో ఏకపక్షంగా ఈస్టర్ కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. ఆదివారం వరకు కాల్పులను విరమించాలని రష్యన్ బలగాలకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. శనివారం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఈస్టర్ సంధిని పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ రష్యా మాదిరిగానే కాల్పుల విమరణను అనుసరిస్తుందని తాను ఆశిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు అన్నారు. అయితే, ఉక్రెయిన్ సంధి ఉల్లంఘనలను తిప్పికొట్టడానికి రష్యన్ దళాలు సిద్ధంగా ఉంచాలని రష్యా జనరల్ స్టాఫ్ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్‌ను ఆయన ఆదేశించారు. మానవతా దృక్పథం ఆధారంగా రష్యా వైపు నుంచి ఈస్టర్ సంధిని ప్రకటించిందని, ఈ కాలంలో అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపేయాలని పుతిన్ ఆదేశించారు.
Read Also: YS.Jagan: కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.. విశాఖ మేయర్ అంశంపై జగన్ ధ్వజం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరుపుతున్న సమయంలో తాత్కాలిక కాల్పుల విరమణ కోసం రష్యా చర్య తీసుకోవడం గమనార్హం. శాంతి చర్చలు నెమ్మదిగా సాగుతుండటం పట్ల ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చర్చలు ఫలితాన్ని ఇవ్వకుంటే అమెరికా చర్చల నుంచి వైదొలగొచ్చని శుక్రవారం ఇద్దరు నాయకులు ప్రకటించారు.