Putin Comments On India: ఉక్రెయిన్ లోని జోపోరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ నాలుగు ప్రాంతాలను అధికారికంగా రష్యా తనలో కలుపుకుంది. అయితే దీనిపై యూఎస్ఏతో పాటు యూరోపియన్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. రష్యా బెదిరింపుకు భయపడేది లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు రష్యాపై మరింతగా ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యాయి. జి 7 దూశాలు కూడా రష్యా, ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమదేశాల ద్వంద్వనీతి తూర్పారపట్టారు. పాశ్చాత్య దేశాలు మధ్యయుగ కాలంలో అనేక దేశాలను లూటీ చేశాయని.. అక్కడి ప్రజలను బానిసలుగా చూశాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని ఎన్నో విధాలుగా దోచుకున్నారని..ప్రజలను బానిసలుగా చేసి వ్యాపారం చేశాయని, అమెరికాలో భారత తెగల మారణహోమం జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని దోచుకున్నప్పుడు పాశ్చాత్య దేశాలకు ఇవన్నీ గుర్తుకు రాలేదా..? అంటూ అమెరికా, యూరోపియన్ దేశాలను ప్రశ్నించారు. భారత్ తో పాటు ఆఫ్రికా దేశాల్లోని అనేక ప్రాంతాల్లో దోపిడి జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలు చైనాకు వ్యతిరేకంగా యుద్ధాలు చేశాయని పుతిన్ గుర్తు చేశారు.
Read Also: UNSC Resolution: రష్యాపై మండిపడిన ఐరాస.. ఓటింగ్‌కు భారత్ దూరం
ఇదిలా ఉంటే నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇకపై అక్కడి ప్రజలు తమ వారే అని.. వారంతా రష్యన్లే అని పుతిన్ స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత జోపోరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు రష్యాలో విలీనం కావడానికే మొగ్గు చూపారు. దీంతో ఉక్రెయిన్ లోని 15 శాతం భూభాగం ఇకపై రష్యాలో చేరినట్లు అయింది. అంతకుముందు 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకుంది.
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ప్రతిపాదనను వేగవంతం చేయాలని కోెరాడు. పుతిన్ ఉన్నంత వరకు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ మాట్లాడుతూ.. అక్రమంగా ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడం యూఎన్ చార్టర్ కు వ్యతిరేకం అని అన్నారు.
