ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారత పౌరులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు సాగుతుండగా.. మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. భారత వైమానిక దళాన్ని తరలింపు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను మరింత వేగంగా తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానం ద్వారా భారతీయులను తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తోంది కేంద్రం.. ఆపరేషన్ గంగా కింద భారత వైమానిక దళం తరలింపు ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.. ఐఏఎఫ్ యొక్క సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఖాళీ చేయించడం సాధ్యం అవుతుందని అంటున్నారు.
Read Also: Viral: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపేశాడు.. ఆ పై..!
భారత వైమానిక దళం ఈరోజు నుంచి ఆపరేషన్ గంగాలో భాగంగా పలు C-17 విమానాలను మోహరించే అవకాశం ఉంది.. నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం 24 గంటలూ పని చేస్తుందని ఈ సమావేశంలో ప్రధాని తెలిపారు.. మరోవైపు… ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కీవ్ సిటీని అత్యవసరంగా వదిలివేయాలని, అందుబాటులో ఉన్న రైళ్లలో లేదా మరేదైనా మార్గంలో వెళ్లాలని కోరింది. కాగా, ఆపరేషన్ గంగా కింద భారత ప్రభుత్వం తరలింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. ఉక్రెయిన్ చుట్టుపక్కల సరిహద్దుల నుండి తరలింపును సమన్వయం చేస్తోంది.. నలుగురు కేంద్ర మంత్రులను కూడా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపించింది.. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, వీకే సింగ్.. కేంద్రంలోని అధికారులు ఆపరేషన్ గంగను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.