Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను విదేశాలతో కలిసి దేశ పతనానికి కుట్ర పన్నిన “స్వార్థపరుడైన రుణగ్రహీత”గా అభివర్ణించారు. విద్యార్థి నిరసనకారుడు అబూ సయీద్‌ను చంపిన దానిపై కూడా ఆమె సందేహాలను లేవనెత్తారు. 8 నిమిషాల వర్చువల్ ప్రసంగంలో ఆమె యూనస్‌పై ధ్వజమెత్తారు. ఆదివారం ఆమె తన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడారు. బంగ్లాదేశ్ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం అవామీ లీగ్‌తో ముడిపడి ఉందని, యూనస్ వీటిని తుడిపెట్టాలని అనుకుంటున్నాడని ఆమె ఆరోపించారు.
స్వాతంత్ర్య ఉద్యమకారుల జ్ఞాపకార్థం అన్ని జిల్లాల్లో తమ ప్రభుత్వం నిర్మించిన ముక్తి జోద్ధా కాంప్లెక్సులను తగలబెడుతున్నారని, మీరు నిప్పుతో చెలగాటం ఆడుకుంటే, అది మిమ్మల్ని కాల్చేస్తుందని ఆమె హెచ్చరించారు. బంగ్లాదేశ్‌ని నాశనం చేయాలనుకుంటున్న విదేశీ కుట్రదారులతో యూనస్ కలిపిపోయాడని ఆమె ఆరోపించారు. దేశాన్ని నాశనం చేయడానికి విదేశీ నిధుల్ని ఉపయోగిస్తున్నాడని, BNP (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) మరియు జమాత్-ఇ-ఇస్లామిలు అవామీ లీగ్ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ, హత్యలకు తెగబడుతున్నారని అన్నారు.
Read Also: Mancherial: మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు..
తమ పాలన ముగియడం బంగ్లాదేశ్ పరిశ్రమలకు షాక్‌ని ఇచ్చిందని, వేలాది కర్మాగారాలు మూతపడ్డాయని, అవామీ లీగ్‌తో సంబంధం ఉన్న కర్మాగారాలు కాలిపోయాయని, హోటళ్లు, ఆస్పత్రులు ప్రతీదాన్ని నాశనం చేస్తున్నారని యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘ చట్ట అమలు చేసే సిబ్బందిని బహిరంగంగా హత్య చేస్తే ఈ దేశం ఎలా నడుస్తుంది? యూనస్‌కు ఇది అర్థం కాలేదా? లేదా అతను దేశాన్ని వినాశనానికి నడిపిస్తున్నాడా? ఈ ఫాసిస్ట్ ఉగ్రవాది యూనస్ అధికారం కోసం దాహంతో మన దేశాన్ని నాశనం చేస్తున్నాడు’’ అని అన్నారు.
షేక్ హసీనాను గద్దె దించేందుకు చెలరేగిన అల్లర్లలో విద్యార్థి కార్యకర్త అబూ సయీద్ మరణించిన ఘటనపై ఆమె సందేహాలు వ్యక్తం చేశారు. సయీద్ మరణంపై పోలీసులు, నిరసనకారులు విరుద్ధమైన వాదనలు చేశారని, దీనిపై హసీనా అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో, ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ నివేదిక ప్రకారం, సయీద్ పోలీసులు “ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధంగా హత్య” చేయబడ్డారని పేర్కొంది. అయితే, పోలీసులు మెటల్ బుల్లెట్స్ వాడలేదని, రబ్బర్ బుల్లెట్స్ వాడారని హసీనా చెప్పారు.
ఈ కేసులో ఒక పోలీస్ ఉన్నతాధికారి నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తే, అతడిని యూనస్ ప్రభుత్వం పదవి నుంచి తీసేసిందని ఆమె చెప్పారు. సయీద్ మృతదేహాన్ని వెలికితీసి మళ్లీ పోస్ట్‌మార్టం చేయాలని, మేము అతడిని చంపలేదని హసీనా చెప్పారు. కష్టపడి పనిచేసే బంగ్లాదేశీయుల కలల్ని యూనస్ తుడిచిపెట్టారని ఆమె ఆరోపించారు.