Peshawar Mosque Blast: పాకిస్తాన్ పెషావర్ నగరంలో సోమవారం మసీదులో బాంబు పేలుడు కారణంగా 101 మంది మరణించారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం పాకిస్తాన్ నిఘా వ్యవస్థను ప్రశ్నిస్తోంది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అలసత్వం, భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పెషావర్ పోలీసులు కూడా అంగీకరించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని మసీదులో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో భారీ ఎత్తున ప్రజలు చనిపోయారు. మధ్యాహ్నం ప్రార్థనలకు ప్రజలు హాజరవుతున్న సందర్భంతో ఈ పేలుడు సంభవించింది.
Read Also: Thalapathy 67: విజయ్-త్రిష కాంబినేషన్ కోసం 14 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారా?
అయితే ఆత్మాహుతి బాంబర్ పోలీస్ యూనిఫాం, హెల్మెట్ ధరించడంతో అతన్ని తనిఖీ చేయలేదని, ఇది భద్రతా లోపం అని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ పోలీస్ ఫోర్స్ అధిపతి మోజమ్ జా అన్సారీ వెల్లడించారు. ఆత్మాహుతి బాంబర్ ఒక్కడే కాదని.. అతని వెనక పెద్ద నెట్వర్క్ ఉందని పాక్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
2021లో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ల పాలన అనంతరం ఈ ప్రాంతంలో చోటు చేసుకునే అతిపెద్ద దాడి ఇదే. ఇటీవల కాలంలో పాకిస్తాన్ తాలిబాన్లు క్రియాశీలకంగా మారారు. అయితే ఇది వీరి పనే అని పాక్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాక్ తాలిబాన్లు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్నారు. అక్కడి గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వానికి సమాంతరంగా.. దాదాపుగా ప్రభుత్వం నియంత్రణ లేకుండా తాలిబాన్లే పాలిస్తున్నారు.