China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు

  • చైనా నుంచి అమెరికాకు అరుదైన బహుమతి
  • స్నేహానికి దూతలుగా రెండు పాండాలు
China Us Panda Diplomacy

China Us Panda Diplomacy

Xi Jinping Announces New Giant Pandas for Atlanta Zoo: అమెరికా-చైనా సంబంధాల్లో పాండా డిప్లొమసీ మరోసారి తెరపైకి వచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా రెండు జెయింట్ పాండాలను అట్లాంటా జూకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాండాలు చైనా, అమెరికా ప్రజల మధ్య స్నేహానికి ‘దూతలు’గా ఉంటాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అట్లాంటా జూకు రానున్న పాండాల్లో ఒకటి మగ పాండా Ping Ping, మరొకటి ఆడ పాండా Fu Shuang. వీరిద్దరూ చైనాలోని చెంగ్డూ రీసెర్చ్ బేస్ ఆఫ్ జెయింట్ పాండా బ్రీడింగ్‌లో జన్మించారు.

ఈ రెండు పాండాలను అట్లాంటా జూకు పంపేందుకు China Wildlife Conservation Associationతో Zoo Atlanta ఏప్రిల్ 2026లో కొత్త అంతర్జాతీయ సహకార పరిశోధనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జిన్‌పింగ్ తాజా ప్రకటన ప్రకారం Ping Ping, Fu Shuang రాబోయే రోజుల్లో అట్లాంటాకు చేరుకోనున్నాయి. అయితే వాటి ఖచ్చితమైన రాక తేదీని జూ అధికారులు ఇంకా వెల్లడించలేదు.

అమెరికా-చైనా స్నేహానికి ప్రతీకగా పాండాలు

పాండాలను చైనా చాలాకాలంగా దౌత్య సంబంధాల్లో స్నేహానికి ప్రతీకగా ఉపయోగిస్తోంది. జిన్‌పింగ్ కూడా ఈ రెండు పాండాలు రెండు దేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడంతో పాటు సహకారాన్ని విస్తరించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. పాండాల పరిరక్షణ, పరిశోధనలో రెండు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించడం కూడా ఈ ఒప్పందంలో కీలక అంశంగా ఉంది.

1972 నుంచి కొనసాగుతున్న ‘పాండా డిప్లమసీ’

అమెరికా-చైనా సంబంధాల్లో పాండాల కథ కొత్తది కాదు. 1972లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాను సందర్శించిన సమయంలో చైనా అమెరికాకు Ling-Ling, Hsing-Hsing అనే రెండు పాండాలను అందించింది. అవి వాషింగ్టన్‌లోని నేషనల్ జూలో ప్రముఖ ఆకర్షణగా నిలిచాయి. ఈ సంప్రదాయానికే తర్వాత ‘Panda Diplomacy’ అనే పేరు వచ్చింది. అట్లాంటా జూతో చైనా గతంలో కూడా దీర్ఘకాలిక పాండా పరిరక్షణ భాగస్వామ్యాన్ని కొనసాగించింది. 1999లో ప్రారంభమైన ఆ ఒప్పందం 2024లో ముగిసింది. ఆ 25 ఏళ్ల భాగస్వామ్యంలో అట్లాంటాలో ఏడు పాండా పిల్లలు జన్మించాయి.

రెండేళ్ల తర్వాత మళ్లీ అట్లాంటాకు పాండాలు

2024లో అట్లాంటా జూలో ఉన్న పాండాలు చైనాకు తిరిగి వెళ్లిన తర్వాత అక్కడ జెయింట్ పాండాలు లేకుండా పోయాయి. ఇప్పుడు Ping Ping, Fu Shuang రాకతో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అట్లాంటా జూలో మళ్లీ పాండాలను చూసే అవకాశం ఏర్పడుతోంది.

ట్రంప్- జిన్‌పింగ్ భేటీలో పాండా ప్రకటన

జిన్‌పింగ్ అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు, సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అదే సమయంలో పాండాలను అట్లాంటాకు పంపుతున్నట్లు జిన్‌పింగ్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ‘పాండా డిప్లమసీ’ మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.