NTV Telugu Site icon

Palm oil: గుడ్ న్యూస్.. పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

Indonesia Palm Oil

Indonesia Palm Oil

ఇండియాకు గుడ్ న్యూస్. రాబోయే కాలంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో ఇండో నేషియా నుంచి ఇకపై వివిధ దేశాలకు పామాయిల్ ఎగుమతి కానుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా జోకో విడొడో తెలిపారు. ఇండోనేషియాలో ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎప్రిల్ 28న పాయాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది అక్కడి సర్కార్. పామాయిల్ వ్యాపారుల నుంచి వస్తున్న ఒత్తడితో అక్కడి ప్రభుత్వం దిగి వచ్చింది. మే 23 నుంచి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేసింది.

గత నెలలో తమ ప్రజలకు ఆయిల్ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇండోనేషియా ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. ఇండోనేషియా తన పామాయిల్ ఉత్పత్తిలో కేవలం 35 శాతం మాత్రమే వాడుకుంటుంది. మిగతాది విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అయితే ఎగుమతులపై నిషేధం విధించడంతో పామాయిల్ ఉత్పత్తుల నిల్వలు భారీగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో ఈ రంగంపై ఆధారపడుతున్న 17 మిలియన్ల కార్మికులు సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

ఇండోనేషియాలో నిషేధానికి ముందు  పామాయిల్ ధర అక్కడి కరెన్సీ ప్రకారం  లీటరుకు 19,800 రూపియా ($1.35) ఉంటే దాదాపు 17,200 రూపాయలకు ($1.17) తగ్గింది. నిషేధం తర్వాత దేశీయ వంటనూనెల సరఫరా కూడా మూడు రెట్లు పెరిగి నెలకు 64,500 టన్నుల నుంచి 211,000 టన్నులకు పెరిగిందని అధ్యక్షుడు విడిడో తెలిపారు.

ఇండియా పామాయిల్ దిగుమతుల కోసం ఇండోనేషియా పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్ తన అవసరాల్లో 70 శాతం ఇండోనేషియా, 30 శాతం మలేషియా నుంచే పామాయిల్ దిగుమతి చేసుకుంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇండియా 83. 1 లక్షల టన్నుల పామాయిల్ ను దిగుమతి చేసుకుంది.  మరో వైపు సన్ ప్లవర్ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యాతో యుద్ధంలో ఉంది. దీంతో గత కొన్ని నెలలుగా దేశంలో పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఇండోనేషియా నిర్ణయంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి.