Pakistan: ఎప్పుడూ లేనంతగా దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ పెట్టే అన్ని షరతులకు తలొగ్గుతోంది. దీంతో ప్రజలపై పన్నులను పెంచింది, ఇది తీవ్ర నిరసనకు దారి తీస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వ ఎయిర్ లైన్ సంస్థ ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)’ కనీసం తన ఇంధన బకాయిలను కూడా చెల్లించలేకపోయింది.
Read Also: Israel: రాకెట్ విఫలమై గాజా ఆస్పత్రి పేలుడు.. ఆధారాలు చూపిన ఇజ్రాయిల్..
ఇంధన బకాయిలు చెల్లించకపోవడంతో పాకిస్తాన్ స్టేట్ ఆయిల్(పీఎస్ఓ), పీఐఏకు ఇంధనాన్ని నిలిపివేసింది. దీంతో పాక్ వ్యాప్తంగా 48 విమానాలు రద్దు చేయబడ్డాయి. ఇందులో మంగళవారం రోజు 11 అంతర్జాతీయ, 13 డొమెస్టిక్ విమానాలు రద్దైతే, బుధవారం రోజు 16 ఇంటర్నేషనల్, 8 డొమెస్టిక్ విమానాలు రద్దు చేయబడ్దాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రద్దు చేయబడిన పీఐఏ విమానాల్లో దుబాయ్, అబుదాబి, కువైట్, షార్జా, మస్కట్ వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. పరిమితంగా ఇంధనం ఉండటం వల్లే కొన్ని సర్వీసులను రద్దు చేసినట్లు పీఐఏ ప్రతినిధి తెలిపారు.
పీఐఏ ఏవియేషన్ ప్యూయల్ కోసం పాక్ స్టేట్ ఆయిల్ సంస్థకు ఏకంగా 100 మిలియన్ పాకిస్తానీ రూపాయలను చెల్లించాల్సి ఉంది. అయితే అడ్వాన్సు చెల్లింపులు లేనిదే ఇంధనం ఇవ్వమని పీఎస్ఓ తేల్చి చెప్పింది. అయితే దివాళా అంచున ఉన్న పాకిస్తాన్ అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ, పాక్ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరింది. దీని కోసం 23 బిలియన్ రూపాలయను అందించాలని కోరాగా.. పాకిస్తాన్ లో ఉన్న అపద్ధర్మ ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉంది.