మానవత్వం మంట కలిసింది.. తోటి స్నేహితురాలి పట్ల జాలి చూపాల్సిన ఓ యువతి.. రాక్షసంగా ప్రవర్తించింది. పాక్‌లో తన తండ్రిని పెళ్లి చేసుకోవాలంటూ మెడికల్ విద్యార్థినిపై ఒత్తిడి చేసింది తోటి స్నేహితురాలు. అందుకా యువతి నిరాకరించింది. తన కంటే వయస్సులో పెద్దవాడైన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవాలని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె ఫ్రెండ్.. తండ్రితో కలిసి యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టింది. అంతేకాదు.. సారీ చెప్పాలని ఆమెతో బూట్లు, చెప్పులు నాకించారు. ఎంత బతిమిలాడిన వినకుండా చిత్రహింసలకు గురి చేశారు. పాకిస్థాన్‌లోని పైసలాబాద్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Read Also: Salary Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! 10 శాతం పెరగనున్న జీతాలు..!
కాగా, పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ కాలేజీలో చదువుతోంది ఆ యువతి.. ఆమె స్నేహితురాలి తండ్రితో పెళ్లికి నిరాకరించడమే ఆమె చేసిన పాపం అయ్యింది.. దీంతో, బాలికపై వేధింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాలిక స్నేహితురాలి తండ్రి, మరికొందరు కలిసి విద్యార్థిని జుట్టు, కనుబొమ్మలను కట్ చేశారు.. రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఆమెను వేధించిన వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించారు. లాహోర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్‌లో ఆగస్టు 8న ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం బయటకు వచ్చింది, అందులో బాలికపై జరిగిన క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోలో, నిందితులు ఆమెపై దాడి చేయడం, ఆమె జుట్టు మరియు కనుబొమ్మలను కత్తిరించడం.. షేక్ డానిష్ అనే వ్యక్తి చెప్పులు నాకించడం వంటి దృశ్యాలున్నాయి.. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ డానిష్, అతని కుమార్తెతో పాటు మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దానిష్ మరియు అతని కుమార్తెతో సహా ఏడుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బాధితురాలు.. వృద్ధురాలైన తన తల్లితో కలిసి నివాసం ఉంటుంది.. ఆమె ఇద్దరు సోదరులు బ్రిటన్ మరియు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. మెడిసిన్ చేస్తోన్న ఆమెను.. కిడ్నాప్ చేశారు.. వేధించారు.. దోపిడీ చేశారు.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.. ఈ ఘటనలో మొత్తం 15 మంది అనుమానితులపై పాకిస్తాన్ పీనల్ కోడ్‌లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో, బాధితురాలు తాను మరియు డానిష్ కుమార్తె స్నేహితులమని, ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ.. తన స్నేహితురాలు.. ఆమె తండ్రి షేక్ డానిష్ ను పెళ్లి చేసుకోవాలని కోరంది.. దానికి నా కుటుంబం, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించామని.. డానిష్ మా నాన్న వయసులో ఉన్నాడని. ఈ విషయం నా స్నేహితురాలు అన్నకు చెప్పగానే నాపై కోపంతో దాడి చేసిందని తెలిపింది.. ఆగస్టు 8న తన సోదరుడు యూకే నుంచి తిరిగొచ్చినప్పుడు డానిష్‌తో పాటు అతని సహచరులు 14 మంది అక్కడికి వచ్చారని.. పెళ్లికి అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారు.. తన సోదరుడు ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో.. దాడి చేసి కిడ్నాప్ చేసి ఘాతుకానికి పాల్పడినట్టు వాపోయింది.
నిందితులు బాలికను బలవంతంగా డానిష్ బూట్లను నాకించడం.. ఆమె జుట్టు మరియు కనుబొమ్మలను కత్తిరించి అవమానించారు.. ఆ దృశ్యాలను వీడియో తీశారు… ఆ తర్వాత ప్రధాన నిందితుడు (డానిష్) ఆమెను (బాధితురాలిని) మరొక గదికి తీసుకెళ్లాడు, అక్కడ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి దానిని వీడియో తీశాడు.. అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను లాక్కొని రూ.5,00,000 నగదు, రూ.4,50,000 విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.