Pakistan unable to feed soldiers: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. పెరిగిన ధరలు, ఆహారం కొరత పాక్ ప్రజలను వేధిస్తున్నాయి. చికెన్, వంటనూనె, పప్పులు, గోధుము ఇలా అన్ని నిత్యావసరాల ధరలు చుక్కలను చూస్తున్నాయి. ఇదిలా ఉంటే పాక్ ప్రభుత్వం అక్కడి సైన్యానికి కనీసం రెండు పూటల తిండి పెట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆర్మీ మెస్ లలో ఆహార కొరత ఏర్పడింది. ఈ విషయమై ఫీల్డ్ కమాండర్లు క్వార్టర్ మాస్టర్ జనరల్ కార్యాలయానికి లేఖలు రాశారు. అన్ని ఆర్మీ మెస్సుల్లో సైనికులకు ఆహార సరఫరాలో కోత విధించారు.
సైనిక అధికారులు ఆహార సరఫరా, లాజిస్టిక్స్ సమస్యలపై చీఫ్ ఆఫ్ లాజిస్టిక్ స్టాఫ్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ తో చర్చించారు. ఈ విషయమై ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ వద్ద తమ సమస్యలను వెళ్లగక్కుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ప్రత్యేక నిధులలో కోత మధ్య సైన్యం సైనికులకు రెండుసార్లు సరిగ్గా ఆహారం ఇవ్వలేకపోతున్నారు. దేశ సరిహద్దుల్లో తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్లను ఎదుర్కొనే సైనికులు మరింతగా ఆహార కోతలను భరించే స్థితిలో లేదని సైన్యం తెలిపింది.
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పాకిస్తాన్ పొదుపు చర్యలను చేపట్టింది. దీంట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించడంతో పాటు రాయబార సిబ్బందిని తగ్గించడం చేసింది. ఐఎస్ఐ, ఐబీకి ఇచ్చే నిధుల్లో కోత పెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రెండు రోజలు క్రితం అన్ని జీతాలు, బిల్లలను ఆపేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఐఎంఎఫ్ షరతులకు ఒప్పుకుని విపరీతంగా పన్నులను పెంచుతోంది. ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు వేసింది.