Pakistan summons US envoy over Joe Biden’s comments: పాకిస్తాన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలపై సమన్వయం లేని కారణంగా పాకిస్తాన్ ప్రపంచంలోనే ప్రమాదకర దేశాల్లో ఒకటి అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి. అమెరికాతో ఇప్పుడిప్పుడే సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని అనుకుంటున్న పాకిస్తాన్ కు ఇది మింగుడు పడటం లేదు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తమ నిరసన తెలుపుతోంది.
పాకిస్తాన్ లోని అమెరికా రాయబారిని పిలిచింది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్ధారీ దీనిపై మాట్లాడుతూ.. జో బైడెన్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నారు. ఇస్లామాబాద్ లోని యూఎస్ రాయబారి డొనాల్డ్ బ్లోమ్ కు సమన్లు జారీ చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ తన సమగ్రత, భద్రతపై కఠినంగా ఉందని.. ప్రశ్నలు లేవనెత్తాలంటే అవి భారతదేశం అణ్వాయుధాలపై ఉండాలని బిలావల్ బుట్టో అన్నారు. పాకిస్తాన్-అమెరికా మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతోనే అపార్థం చేసుకున్నట్లు ఉన్నారని ఆయన అన్నారు.
Read Also: Uttam Kumar Reddy : టీఆర్‌ఎస్ పాలనలో ఒక్క గిరిజనుడు పట్టా వచ్చిందా
గతంలో భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడిన విషయాన్ని బుట్టో ప్రస్తావించారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రిసెప్షన్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. చైనా, రష్యాకు వ్యతిరేకంగా యూఎస్ విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ హయాంలో పాకిస్తాన్- అమెరికా సంబంధాలు క్షీణించాయి. అమెరికా ఇచ్చే సైనిక సహాయాన్ని కడా నిలిపివేసింది. అయితే జో బైడెన్ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో రెండు దేశాలు సంబంధాలను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ అమెరికా సాయాన్ని కోరుతోంది. ఇప్పటికే ఎఫ్-16 విమానాలను ఆధునీకీకరించే ఢిపెన్స్ డీల్ అమెరికా- పాకిస్తాన్ మధ్య కుదిరింది. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్ కాస్త ఆందోళన చెందుతోంది.