Pakistan Netizens demand justice after US vlogger: పాకిస్తాన్ లో అమెరికన్ మహిళపై లైంగిక దాడి సంఘటన అగ్గిరాజేస్తోంది. ఆ దేశ యువత, నెటిజెన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ వ్లాగర్, టిక్ టాకర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన మహిళా వ్లాగర్ అండ్ టిక్ టాకర్ పై ఇటీవల సామూహిక లైంగిక దాడి జరిగింది. పాకిస్తాన్ లోని ప్రసిద్ధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. జూలై 17న 21ఏళ్ల అమెరికన్ యువతిపై పంజాబ్ ప్రావిన్స్ లోని డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేషన్ ఫోర్ట్ మన్రోలో ఓ హోటల్ లో సామూహిక అత్యాచారం జరిగింది.
ప్రధాన నిందితుడు ముజామిల్ షాజాన్ సిప్రా, యువతికి సోషల్ మీడియా ఫ్రెండ్. ఇతడి ఆహ్వానం మేరకే యువతి కరాచీ నుంచి పోర్ట్ మన్రోకు వచ్చింది. అతని ఆహ్వానం మేరకు రాజన్ పూర్ లో ఉన్న అతని ఇంటికి కూడా వెళ్లింది. సిప్రా, అతని స్నేహితుడు అజాన్ ఖోసాలతో కలిసి పోర్ట్ మన్రోలో యువతి వ్లాగ్ కూడా చేసింది. అయితే హోటల్ గదిలో ఉన్న సమయంలో సిప్రా, అజాన్ ఇద్దరూ యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఫోర్ట్ మన్రో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Read Also: 68th National Film Awards : జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగువారికి నాలుగే!
అయితే ఈ ఘటనలపై పాక్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో నిందితులపై చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరగకపోవడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని.. దేశంలో స్వదేశీయులకే రక్షణ లేని.. విదేశీయులు ఎలా ఉంటారని ప్రజలు, నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. టూరిస్ట్ ర్యాకింగ్స్ లో పాక్ 83వ స్థానంలో ఉందని..టూరిస్ట్ సేఫ్టీలో 26వ స్థానంలో ఉందని.. ఇది సిగ్గు పడే అంశం అని పాకిస్తాన్ నెటిజెన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.