Pakistan: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, ప్రజలు అడుక్కుతింటున్నా పాకిస్తాన్ మాత్రం తన సైనిక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. గేమ్ ఛేంజింగ్‌గా మారే మిలిటరీ డీల్‌కి దాయాది దేశం సన్నద్ధమవుతోంది. అత్యాధునిక 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ J-35Aలను చైనా నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. చైనా నుంచి 40 అధునాతన స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేయడానికి ఇస్లామాబాద్, చైనాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఒక వేళ ఈ ఒప్పందం ఖరారైతే, చైనా వెలుపల స్టెల్త్ J-35A మల్టీ-రోల్ ఫైటర్ జెట్‌ల స్క్వాడ్రన్‌ను కలిగి ఉన్న మొదటి మరియు ఏకైక దేశం పాకిస్తాన్ అవుతుంది. J-35A అనేది చైనాకి చెందిన రెండో ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్. అమెరికా తర్వాత ఇలాంటి విమానాలను కలిగిన ఏకైక దేశంగా చైనా ఉంది. యూఎస్ ఎఫ్-16, ఫ్రెంచ్ మిరాజ్‌లను J-35Aలతో భర్తీ చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. రెండేళ్ల లోపు ఈ ఫైటర్ జెట్లను పాకిస్తాన్‌కి అందించాలని చైనా ప్రయత్నిస్తున్నట్లు హాంకాంగ్‌కి చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఈ యుద్ధవిమానాలను కొనుగోలు చేయడానికి పాక్ ఎయిర్‌ఫోర్స్ ఇప్పటికే ఆమోదం తెలిపిందని నివేదిక పేర్కొంది. అయితే, చైనా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ధ్రువీకరణ లేనప్పటికి, ఒక వేళ ఈ డీల్ కుదిరితే పాకిస్తాన్ స్టెల్త్ టెక్నాలజీని పొందే అవకాశం ఉంది.
Read Also: Sritej Father Bhaskar : అల్లు అర్జున్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది.. కేసు వాపస్ తీసుకుంటా..!
J-35A విమానాల ప్రత్యేకత..
షెన్యాంగ్ J-35A అనేది స్టెల్త్ ఫైటర్ జెట్, ట్విన్ ఇంజన్, సింగిల్ సీటర్, సూపర్ సోనిక్ విమానం. ఎయిర్ సుపీరియారిటీ, మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది భూమిపై, సముద్రాలపై మిషన్స్ నిర్వహించగలదు. J-35A అనేది J-20 తర్వాత చైనా అభివృద్ధి చేసిన రెండవ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్. J-35A డిజైన్ దాదాపుగా అమెరికా లాక్‌హీడ్ మార్టిన్ F-35 మాదిరిగానే ఉంటుంది. ప్రధాన తేడా ఏంటంటే J-35A రెండు ఇంజన్లను కలిగి ఉంటే, F-35కి సింగిల్ ఇంజన్ ఉంటుంది. అమెరికా విమానాలను కాపీ కొడుతుందనే ఆరోపణలు ఎప్పటి నుంచో చైనాపై ఉన్నాయి. చైనాకు చెందిన J-20 కూడా అమెరికాకు చెందిన F-22 రాప్టర్ పోలికల్ని కలిగి ఉంటుంది. చెంగ్డు J-10 ఫైటర్ జెట్ అమెరికాకు చెందిన US F-16 ఫైటర్ జెట్‌కి కాపీగా ఉంది.