గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం పాకిస్థాన్‌పై ప్రతీకారంగా మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు నాలుగు రోజులు తర్వాత కాల్పుల విరమణ జరిగింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో 100 మంది ఉగ్రవాదులు చనిపోగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.

తాజాగా ఆపరేషన్ సిందూర్ ఆపేందుకు అమెరికాలో పాకిస్థాన్ తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేసినట్లుగా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ పత్రాలు పేర్కొన్నాయి. అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి, రక్షణ అధికారులు 60 మందికిపైగా అధికారులు.. మధ్యవర్తులతో ఈ-మెయిల్‌లు, ఫోన్‌కాల్స్, వ్యక్తిగత సమావేశాల ద్వారా పదే పదే అమెరికాతో సంప్రదింపులు జరిగినట్లుగా ప్రభుత్వ పత్రాలు వెల్లడించాయి.
ఏదొక విధంగా ఆపరేషన్ సిందూర్ ఆపాలని.. జోక్యం కోసం వాషింగ్టన్‌పై ఒత్తిడి చేయాలని ఇస్లామాబాద్ కోరినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ను ఎదుర్కొనేందుకు ఇస్లామాబాద్ తీవ్ర ఇబ్బందులు పడడంతో పాకిస్థాన్ అసాధారణమైన లాబీయింగ్ దిగినట్లుగా అమెరికా ప్రభుత్వ పత్రాలు పేర్కొన్నాయి. మొత్తానికి మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.
అమెరికా ద్వారా లాబీయింగ్ చేయడంతో ప్రతిఫలంగా నవంబర్ 2025లో ఏటా దాదాపు 5 మిలియన్ల విలువైన వాణిజ్య ఒప్పందాలపై పాకిస్థాన్ సంతకం చేసిందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్ ఒప్పందం కుదుర్చుకున్న వారాల తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్‌కు ట్రంప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మునీర్‌కు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ అసిమ్ మునీర్ నామినేట్ చేశారు.
మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. అయినా కూడా ట్రంప్.. భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపినట్లుగా ఎక్కడికెళ్లానా చెప్పేవారు. మరోవైపు భారత్ ఖండిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 70 సార్లు వరకు ట్రంప్ ఆ ప్రకటన చేశారు. అయితే ట్రంప్ ప్రకటనకు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు ఇవ్వగా.. భారత్ వ్యతిరేకిస్తూ వచ్చింది.