Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?

  • పాకిస్తాన్ సైన్యం జీతాలు భారీగా పెంపు..
  • 25 శాతం పెరిగిన జీతాలు..
  • సైనికులు మనోబలం కోసమేనా.?
Asim Munir

Asim Munir

Pakistan:  ఆపరేషన్ సిందూర్‌లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ సైనికులకు ఆ దేశ ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటిస్తూనే ఉంది. భారత్‌తో జరిగిన ఘర్షణలో తామే గెలిచామంటూ ఫేక్ ప్రచారం చేసుకుని, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ‘‘ఫీల్డ్ మార్షల్’’గా పదోన్నతి పొందాడు. ఇదే కాకుండా ఆ దేశ సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ తన సైనికులు జీతాలను 25 శాతం పెంచింది. ఆపరేషన్ సిందూర్ వల్ల కలిగిన నష్టాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆమోదం తర్వాత, పాక్ సైనికులు, ఇతర అధికారుల జీతాలు పెంచబడ్డాయి. సవరించిన ప్యాకేజీలో తాత్కాలిక సహాయ భత్యాన్ని 25 శాతం పెంచడంతో పాటు, డిస్ట్రబెన్స్ అలవెన్స్‌ను మూడు రెట్లు పెంచారు. యూనిఫాం, క్యాష్ బెనిఫిట్స్, బాట్మాన్ భత్యాలను కూడా రెండింతలు చేసినట్లు తెలుస్తోంది.

పాక్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో సైన్యం తన జీతాలను పెంచుకుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సైనికుల మనోబలాన్ని పెంచడానికి ఈ పెంపు సాయపడుతుందని పాక్ భావిస్తోంది. ఇటు ఇండియా చేతిలో తీవ్రంగా దెబ్బతినడం, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల్లో సైనికుల్ని తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులు చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పెంపు ఆసక్తికరంగా మారింది.