ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన సంఘటనను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దైవిక సహాయం పొందినట్లుగా తెలిపాడు. భారత దళాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఈ సహాయం పొందినట్లుగా పేర్కొన్నాడు. మునీర్ చేసిన ప్రసంగం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తెరపైకి వచ్చాయి.
ఇస్లామాబాద్‌లో జరిగిన జాతీయ ఉలేమా సమావేశంలో అసిమ్ మునీర్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు దైవిక సహాయం లభించినట్లుగా పేర్కొన్నాడు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో తేదీ లేని క్లిప్ వైరల్ అవుతోంది. ఉర్దూలో మాట్లాడిన మునీర్ ‘‘అల్లాహ్ మీకు సహాయం చేస్తే ఎవరూ మిమ్మల్ని అధిగమించలేరు.’’ అనే ఖురాన్ వాక్యాన్ని ఉదహరించాడు. శత్రువులు దాడి చేస్తున్న సమయంలో పాకిస్థాన్‌కు కనిపించని మద్దతు లభించినట్లుగా పేర్కొన్నాడు.
ఆద్యంతం మునీర్ చేసిన ప్రసంగమంతా మతపరమైన అంశాలనే ప్రస్తావించాడు. ఆధునిక పాకిస్థాన్‌ను 1,400 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఇస్లామిక్ రాజ్యాంతో పోల్చాడు. ముస్లిం దేశాల గురించి ప్రస్తావిస్తూ… ప్రపంచ వ్యాప్తంగా 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయని.. అయితే అందుకు భిన్నంగా పాకిస్థాన్‌కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నాడు. ఇక పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా సమస్యలను కూడా ప్రస్తావించాడు. పాకిస్థాన్‌లోకి చొరబడుతున్న వారిలో ఎక్కువగా ఆప్ఘన్ జాతీయులే ఉన్నారని ఆరోపించాడు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 7న పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడులు చేశాయి. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. మొత్తానికి మే 10న ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.
