Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక

  • ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులకు తెగబడ్డ పాకిస్తాన్..
  • తగిన సమాధానం ఇస్తామని తాలిబాన్ వార్నింగ్..
Taliban

Taliban

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తోంది. వరసగా రెండోసారి గురువారం తెల్లవారుజామున ఆఫ్ఘాన్‌లోని 10 ప్రాంతాల్లో పాక్ దాడి చేసింది. ఈ ప్రాంతాలను డ్రోన్లను ప్రయోగించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. ఈ డ్రోన్లలో కొన్నింటిని తమ దేశంపై దాడికి ఉపయోగించారని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ దాడుల్లో నలుగురు మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది.

అయితే, పాకిస్తాన్ దాడులపై రష్యా స్పందించింది. కాబూల్‌లోని రష్యన్ ఎంబసీ, ఆఫ్ఘాన్‌లోని తూర్పు ప్రావిన్సులలో వైమానిక దాడుల కారణంగా పౌరులు మరణించడం, గాయపడటంపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇరు పక్షాలు శాంతియుతంగా ఉండాలని, చర్చల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవాలని సూచించింది.

ఈ దాడిపై ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్ పాలకులు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇన్షా అల్లా, ఈ దుస్సాహసమైన దురాక్రమణలకు, ఉల్లంఘనలకు గట్టి ప్రతిస్పందన ఇవ్వబడుతుంది’’ అని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతినిధి అన్నారు. తాలిబాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైనిక పాలన మరోసారి ఆఫ్ఘాన్‌లోని కందహార్, పక్తియా, ఖోస్ట్ ప్రావిన్సులపై వైమానిక దాడులు చేసిందని చెప్పారు. ఈ దాడుల్లో నలుగురు మరణించినట్లు వెల్లడించారు. ఈ పరికిపంద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఉల్లంఘన, స్పష్టమైన దురాక్రమణ, నేర చర్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. తాను పాకిస్తాన్‌పై దాడికి ఎలాంటి డ్రోన్లు పంపించలేదని ఆఫ్ఘనిస్తాన్ స్పష్టం చేసింది.