పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి కోల్పోయే ప్రమాదం ఉన్న ఆయన భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఖైబర్ ఫక్తూన్వాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్ ఖాన్.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నారు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదన్నారు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండటం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక, భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తున్నందుకు ఆ దేశానికి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు ఇమ్రాన్ ఖాన్. అమెరికా ఉన్న క్వాడ్ కూటమిలో సభ్యదేశంగా ఉన్న భారత్.. ఉక్రెయిన్ అంశంలో తటస్థంగా ఉన్నామని చెబుతోందన్నారు. రష్యాపై పలు దేశాల ఆంక్షలు ఉన్న సమయంలోనూ ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందన్నారు. భారత విదేశాంగ విధానం అద్భుతంగా ఉంటుందని, పౌరుల కోసం ఎంతకైనా తెగిస్తుందంటూ ఆకాశానికి ఎత్తారు. ఇక పదవీ గండంపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్..రాజీనామాకు తాను ఎప్పటికైనా సిద్ధమన్నారు. అలాగని విపక్షాల ఒత్తిళ్లకు తాను తలొగ్గనని, ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని, పదవిని నిలబెట్టుకోలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అవిశ్వాస తీర్మానం రూపంలో కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: KCR: కేంద్రంపై మరో పోరు.. ఢిల్లీకి కేసీఆర్ బృందం
మార్చి 28న నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా పీటీఐకి చెందిన 24 మంది సభ్యులు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బహిరంగంగా ప్రకటించారు. పీటీఐ సభ్యులు ప్రస్తుతం సింధ్ హౌస్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ 24 మంది ఎంపీలు చివరి రోజు అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే వరకూ సురక్షిత ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాలంటే 68 మంది ఎంపీల సంతకాలు అవసరం. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100 మంది సభ్యులు ఇప్పటికే సంతకం చేశారు. ప్రస్తుతం 342 మంది సభ్యులున్న పాక్ పార్లమెంటులో 172 మంది ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రధాని కుర్చీ నుంచి ఆయన దిగిపోవాల్సిందే. ఇమ్రాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. పాకిస్తాన్ ముస్లింలీగ్ -నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలకు కలిపి 163 మంది సభ్యులు ఉన్నారు. ఇమ్రాన్ పార్టీ ఎంపీలు రెబల్స్‌గా మారడంతో ఇప్పుడు ఖాన్ పదవికి గండం ఏర్పడింది.