Ozone Depletion: భూమిపై వాతావరణం వేగంగా మారుతోంది. పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల కారణంగా కాలాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవుల అభివృద్ధి భూమిని రక్షించే ఓజోన్ లేయర్ ను దెబ్బతీస్తోంది. ఇప్పటికే క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ లేయర్ క్షీణిస్తోంది. అయితే తాజాగా మరో మూలకం ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అంతర్జాతీయ పరిశోధకులు బృందం ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధన చేస్తున్న సమయంలో ఈ కొత్తగా అయోడిన్ మూలకం కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తుందని తేలింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం), పూణేతో సహా 20 దేశాల నుండి వంద మందికి పైగా పరిశోధకులు, స్విట్జర్లాండ్‌లోని ఎక్స్‌ట్రీమ్ ఎన్విరాన్‌మెంట్స్ రీసెర్చ్ లాబొరేటరీ, ది సైప్రస్ ఇన్‌స్టిట్యూట్ ఫిజికల్ సైన్సెస్ లాబొరేటరీ సహకారంతో ఆర్కిటిక్‌లో మార్పులను విశ్లేషించడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్లోరోఫ్లోరో కార్బన్ల(సీఎఫ్సీ) తర్వాత అయోడిన్ ఓజోన్ పొరను దెబ్బతీస్తుందని తేలింది.
Read Also: China: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం… 42 అంతస్తుల భవనం అగ్నికి ఆహుతి
ఓజోన్ పొర అంటే ఏమిటి:
ఓజోన్ లేయర్ భూమికి 10-15 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. ఓజోన్ లేయర్ మూడు ఆక్సిజన్ (O3) అణువుల సమ్మేళనం. ఇది భూమిని సూర్యుడి ప్రమాదకరమైన కిరణాల నుంచి కాపాడుతోంది. ఆల్ట్రావయోలెట్(యూవీ) కిరణాలను ఓజోన్ లేయర్ శోషించుకోవడం వల్ల ఈ హానికరమైన కిరణాలు భూమిపై పెద్దగా ప్రభావం చూపించవు. అయితే ఇటీవల కాలంలో రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో సీఎఫ్సీ వాయువును వాడుతున్నారు. దీంతో వాతావరణంలోకి విడుదలైన సీఎఫ్సీ వాయువు, ఓజోన్ లేయర్ ని దెబ్బతీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఓజోన్ లేయర్ లో రంధ్రాలు కూడా ఏర్పడ్డాయి. క్లోరోఫ్లోరో కార్బన్లు, ఓజోన్ తో చర్య పొందడం వల్ల ఆక్సిజన్, క్లోరిన్ మోనాక్సైడ్ ఏర్పడుతోంది. దీంతో సహజసిద్ధమైన ఓజోన్ లేయర్ దెబ్బతింటోంది.
అయోడిన్ ఎలా దెబ్బతీస్తుంది:
అయోడిన్ వసంత కాలంలో ఓజోన్ క్షీణతను పెంచుతోందని పరిశోధనల్లో తేలింది. అయోడిన్, క్లోరోఫ్లోరో కార్బన్ల తరువాత ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది. సముద్ర అయోడిన్ ఉద్గారాల వల్ల ఓజోన్ పొర ప్రమాదంలో పడుతోందని పరిశోధకలు భావిస్తున్నారు. ఆయోడిన్, ఓజోన్ ప్రతిచర్య వల్ల ఓజోన్ లేయర్ క్షీణిస్తోందని పరిశోధనల్లో తేలింది.