Pakistan: పాకిస్తాన్‌లో చలి తీవ్రతతో పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా ఆ దేశంలో చలి వాతావరణం కారణంగా న్యుమోనియా విజృంభిస్తోంది. న్యుమోనియా కారణంగా పంజాబ్ ప్రావిన్సులో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మరణించిన పిల్లల్లో చాలా మందిని న్యుమోనియా వ్యాక్సిన్ వేయలేదని పంజాబ్ ఆపద్ధర్మ ప్రభుత్వం వెల్లడించింది.
న్యుమోనియా టీకాలు వేయకపోవడం, పోషకాహార లోపం, తల్లిపాలు లేని కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, తీవ్రమైన వాతావరణ కారణంగా మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 31వరకు పంజాబ్ ప్రావిన్సులో పాఠశాలలు ఉదయం తెరుచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. జనవరి 1 నుంచి ప్రావిన్స్ వ్యాప్తంగా మొత్తం 10,520 న్యుమోనియా కేసులు నమోదయ్యయి. మొత్తం 220 మరణాల్లో.. పిల్లలు 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే అధికం. పంజాబ్ రాజధాని లాహోర్‌లోనే 47 మరణాలు సంభవించాయి.
Read Also: Car Mileage: “కార్ మైలేజ్ రావడం ఇవ్వడం లేదని”.. 20 ఏళ్ల తర్వాత మారుతి సుజుకీకి జరిమానా..
దీనిపై పాక్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో శిశువులు పుట్టిన ఆరు వారాల తర్వాత సీసీవీ యాంటీ న్యుమోనియా వ్యాక్సిన్ ఇస్తారన్నారు. శిశువు పుట్టినప్పటి నుంచి 12 టీకాలు ఇస్తే అందులో 3 న్యూమోనియా నుంచి రక్షించడానికి ఉద్దేశించబడినవన్నారు. న్యుమోనియా వైరస్, బ్యాక్టీరియా రెంటింటి వలన రావచ్చని, న్యుమోనియా బారిన పడకుండా మాస్కులు ధరించాలని, చేతులను నీటితో కడుక్కోవాలని, వెచ్చని బట్టలు ధరించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. గతేడాది పంజాబ్ లో 990 మంది చిన్నారులు న్యుమోనియాతో మరణించారు. చలి వాతావరణం పెరగడం వల్ల పిల్లల్లో వైరల్ న్యుమోనియా వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ఈ వ్యాధి కోవిడ్-19 లాగా వ్యాపిస్తుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.