దేశంలోని ప్రజల కోసం ఒకవైపు ఆహారాన్ని సమకూర్చుకుంటూనే, మరోవైపు క్షిపణీ ప్రయోగాలు చేస్తున్నది ఉత్తర కొరియా. 2022 జనవరిలో ఇప్పటి వరకు మొత్తం 7 క్షిపణీ ప్రయోగాలు చేపట్టింది. ఆదివారం ఉదయం సమయంలో ఉత్తర కొరియా భారీ క్షిపణిని ప్రయోగించి షాకిచ్చింది. ఇప్పటి వరకు స్వల్పశ్రేణి క్షిపణుల ప్రయోగాలు చేసిన ఉత్తర కొరియా 2017 తరువాత మరోసారి భారీ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి భూమినుంచి 2000 కిమీ ఎత్తుకు చేరుకొని అక్కడి నుంచి జపాన్ సముద్రంలో పడిపోయింది. జపాన్‌కు 800 కిమీ దూరంలో సముద్రంలో పడిపోయింది. భారీ క్షిపణి ప్రయోగంపై అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లు మండిపడ్డాయి.
Read: రష్యాలో మరో సంక్షోభం… ఇలానే కొనసాగితే భవిష్యత్తులో…
ఐరాస నిబంధనలకు ఇది విరుద్దమని అమెరికా వాదిస్తోంది. అయితే, తమదేశ సైనిక శక్తి భద్రతకు ప్రయోగాలు చేసినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. 2017లో ఒకసారి హాసాంగ్ 12 అనే భారీ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఆ తరువాత మరోసారి అదే స్థాయిలో పరీక్షలు నిర్వహించింది. 2018లో అణుపరీక్షల అనంతరం క్షిపణీ పరీక్షలపై మారటోరియం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, 2019లో మారటోరియంను ఎత్తివేసి క్షిపణీప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. తాజా ప్రయోగంతో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా చెబుతున్నది.