Site icon NTV Telugu

North Korea Missile Launch: మూడురోజుల్లో రెండోసారి క్షిపణి ప్రయోగం

North Korea

North Korea

ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా ఉత్తర కొరియా తన తీరు మార్చుకోవడం లేదు. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. దీనికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని అమెరికా హెచ్చరికలు చేసింది. దీనికి అనుగుణంగానే ఉత్తర కొరియా తన వైఖరిని చాటుకుంటోంది.

ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పక్కనపెట్టి క్షిపణి ప్రయోగాలు చేపడుతున్న ఉత్తరకొరియా తాజాగా నిన్న జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (ఎస్ఎల్‌బీఎం)ని పరీక్షించింది. ఇది ఓ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. తన ప్రధాన నౌకాదళ స్థావరమైన సిన్‌పో సమీపంలో దీనిని ప్రయోగించినట్టు తెలుస్తోంది. గత మూడు రోజుల్లో ఇది రెండో క్షిపణి ప్రయోగం. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా యున్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం చేయడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ ప్రయోగం చేపట్టడం చర్చకు దారితీసింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా నిర్ధారించింది. సిన్‌పోలో జలాంతర్గాములు ఉన్నట్టు నిర్ధారించే ఉపగ్రహ చిత్రాలు విడుదల అయ్యాయి. జపాన్ కోస్ట్‌గార్డ్ కూడా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగినట్టు తెలిపింది.

ఇదిలా వుంటే… అణు పరీక్షలకు కిమ్ సిద్ధమవుతున్నట్టు అమెరికా ఆందోళన చెందుతోంది. అణు పరీక్ష కోసం నార్త్ కొరియా ‘పుంగే-రి’ టెస్ట్ సైట్‌ను సిద్ధం చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ఈ నెలాఖరులో జపాన్, దక్షిణ కొరియాలలో పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరేమనుకున్నా ఉత్తర కొరియా మాత్రం తగ్గేదేలే అంటోంది.

Cyclone: వాయువేగంతో రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘ఆసాని’ తుపాన్!

Exit mobile version