Netanyahu: ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రకంగా చెప్పాలంటే అవమానం. శుక్రవారం ఆయన ప్రసంగించే సమయంలో చాలా దేశాల ప్రతినిధులు, రాయబారులు సామూహికంగా వాకౌట్ చేశారు. గాజాలో ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. నెతన్యాహూ ప్రసంగం కొనసాగుతుంటేనే ఒక్కొక్కరుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ, ఇజ్రాయిల్ గాజాలో ‘‘పనిని పూర్తి చేస్తుంది’’, సాధ్యమైనంత త్వరగా చేస్తుందని ప్రకటించారు. తన ప్రసంగాన్ని పాలస్తీనియన్లు అందరు వినాలని గాజా స్ట్రిప్ చుట్టూ లౌడ్ స్పీకర్లు ఉంచాలని ఇజ్రాయిల్ సైన్యాన్ని నెతన్యాహూ ఆదేశించారు. అరబ్, ముస్లిం దేశాల నుంచి దాదాపు అందరు ప్రతినిధులు ప్రసంగం సమయంలో వాకౌట్ చేశారు. అనేక ఆఫ్రికన్ దేశాలు, యూరప్ దేశాల ప్రతినిధులు కూడా బయటకు వెళ్లారు.
దీనికి ముందు ఒక రోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు వీసా నిరాకరించింది. దీంతో ఆయన జనరల్ అసెంబ్లీలో రిమోట్‌గా ప్రసంగించారు. ప్రజలు ఎన్ని బాధలు అనుభవించినా, పాలస్తీనియన్లు గాజాను ఎప్పటికీ వదిలి వెళ్లరని అన్నారు. ఇజ్రాయిల్ నిఘా విభాగం గాజా అంతటా వినిపించేలా నెతన్యాహు ప్రసంగాన్ని ప్రసారం చేసింది. హమాస్ నాయకులు లొంగిపోవాలని, ఆయుధాలు విడిచిపెట్టి, బందీలను వదిలేయాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయిల్‌ను విమర్శిస్తున్న దేశాలకు నెతన్యాహూ చాటా ఘాటుగా సమాధానం ఇచ్చారు. పక్షపాత మీడియా, రాడికల్ ఇస్లామిస్ట్, సెమిటిక్ వ్యతిరేక మూకలకు వారు లొంగిపోయారని అన్నారు. ‘‘పరిస్థితులు కఠినంగా మారినప్పుడు, ధైర్యవంతులు ముందుకు సాగుతారు. కానీ ఇక్కడ చాలా దేశాలు పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, వెనక్కి తగ్గి లొంగిపోయారు’’ అని నెతన్యాహూ అన్నారు.