Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ నేత, హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశంలో హిందువులకు పెద్ద దిక్కుగా ఉన్న బ్రహ్మచారిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాజధాని ఢాకాలో ఇతడిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అక్కడి కోర్టు ఆయనకు బెయిల్‌ని కూడా ఇవ్వకుండా, జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. దేశద్రోహం కేసును మహ్మద్ యూనస్ ప్రభుత్వం అతడిపై మోపింది. ఈ రోజు చిన్మోయ్ మద్దతుగా కోర్టు వద్దకు చేరకున్న హిందువులపై అక్కడి పోలీసులు తీవ్రమైన దాడి చేశారు.
Read Also: Mega DSC: గుడ్‌న్యూస్.. మెగా డిఎస్సీ సిలబస్‌పై ప్రభుత్వ ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
ఇదిలా ఉంటే, చిన్మోయ్ కృష్ణదాస్ తరుపు వాదిస్తున్న ముస్లిం లాయర్ చిట్టోగ్రామ్ కోర్టు వెలుపల జరిగిన పోలీస్ హింసలో మరణించాడు. ఇప్పటికే ఈ హింసపై భారత్ స్పందించింది. చిన్మోయ్ అరెస్టుపై భారత్ తన ఆందోళనని వ్యక్తం చేసింది. ఈ విషయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మైనారిటీలపై దాడులు సరికావని తెలిపింది. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారుల్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.
బంగ్లాలో మొత్తం 18 కోట్ల జనాభాలో 8 శాతం హిందువులు ఉన్నారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత అక్కడ హిందువులు, హిందువుల ఆస్తులు, వ్యాపారాలు, గుడులపై దాడులు ఎక్కువయ్యాయి. ఈ నెల ప్రారంభంలో మైనారిటీ హక్కుల ర్యాలీలో పాల్గొన్న 19 మందిపై దేశద్రోహ కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం.. ఇస్కాన్‌కి చెందిన కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను సోమవారం పోలీసులు ఢాకా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.