ప్రపంచం కరోనా వల్ల గత రెండేళ్ల నుంచి ప్రపంచం కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతోంది. వరసగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా ధాటికి ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే కొత్తకొత్త వైరస్ జాడలు, వ్యాధులు ప్రపంచంలో ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. కరోనాకు ముందు జీకా, స్వైన్ ఫ్లూ, నిఫా ఇలా ఏదో రకమైన వైరస్ లు ప్రజలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ వ్యాధులు ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి.
తాజాగా అత్యంత అరుదైన మంకీపాక్స్ వ్యాధి ఇంగ్లాండ్ లో నమోదైంది. అత్యంత అరుదైన వైరస్ వ్యాధిగా మంకీపాక్స్ కు పేరుంది. అత్యంత అరుదైన మశూచి లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ కోవకు చెందినది ఈ మంకీపాక్స్. ఇటీవల నైజీరియా నుంచి ఇంగ్లాండ్ వచ్చిన ఓ వ్యక్తి ఈ అరుదైన వైరస్ సోకింది. ప్రస్తుతం లండన్ లో చికిత్స పొందుతున్నాడు బాధితుడు. బాధితుడిని నిపుణులు ఇన్ఫెక్షియస్ డిసీజ్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఈవ్యాధిని మొదట కనుక్కున్నారు. అటవీ జంతువుల కారణంగా ముఖ్యంగా ఎలుకల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ వైరస్ పోక్సీవిరిడే కుటుంబానికి చెందిన ఆర్థోపాక్స్ వర్గానికి చెందిన అరుదైన వైరస్.
1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తొలి మంకీపాక్స్ వైరస్ వ్యాధి నమోదైంది. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఆఫ్రికా వెలుపల యూకే, యూఎస్, ఇజ్రాయిల్, సింగపూర్ దేశాల్లో ఈ వ్యాధి నమోదైంది. 2018లో చివరి సారిగా యూకేలో మంకీపాక్స్ వ్యాధి బయటపడింది. ఆతరువాత తాజాగా మరోసారి యూకేలోనే ఈ వ్యాధిని ధ్రువీకరించారు. అయితే సానుకూల విషయం ఏమిటంటే ఈ వ్యాధి సోకిన వ్యక్తి కొన్నివారాల్లోనే కోలుకుంటారు. ఇతరుకు కూడా అంత సులభంగా వ్యాపించదని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు చర్మంపై గాయాలు, శ్వాస, ముక్కు, గొంతు, కళ్ల నుంచి సోకవచ్చు. ఈ వ్యాధి సోకితే… చర్మంపై దద్దుర్లు, జ్వరం, జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.