Pakistan: ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి స్వర్గధామం అయిన పాకిస్తాన్‌లో ఇప్పుడు వారికి రక్షణ కరువైంది. ముఖ్యంగా భారత వ్యతిరేక టెర్రరిస్టులు ఇళ్లలో నుంచి బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి చేరడం లేదు. ‘‘అజ్ఞాత వ్యక్తుల’’ లేదా ‘‘గుర్తు తెలియని వ్యక్తుల’’ దాడుల్లో వరసగా మరణిస్తున్నారు. సింపుల్‌గా బైక్‌పై వచ్చే వీరి, ఉగ్రవాదిని దగ్గర నుంచి కాల్చివేసి, వేగంగా అక్కడి నుంచి పారిపోతున్నారు. అసలు వీరు ఎవరనే విషయం ఇప్పటికీ పాక్ ప్రభుత్వానికి, దాని గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి అస్పష్టంగా ఉంది.
Read Also: Mark Shankar: పవన్ కుమారుడికి గాయాలు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, రోజా..
తాజాగా మరో భారత వ్యతిరేక ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధినేత, భారతదేశ శత్రువు మౌలానా మసూద్ అజార్ బంధువు మౌలానా ఐజాజ్ అబిద్ కాల్చి చంపబడ్డాడు. పాకిస్తాన్ రాడికల్ ఇస్లామిస్ట్‌గా ఐజాజ్ అబిద్‌కు పేరుంది. ఇతను జైషే మహ్మద్ కోసం కీలక రిక్రూటర్‌గా ఉన్నాడు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌లోని పిష్టాఖరా ప్రాంతంలో పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు అబిద్‌ని కాల్చి చంపారు. ఇతడి సహాయకుడు ఖారీ షాహిద్ తీవ్రంగా గాయపడ్డారు.
అహ్లే-ఎ-సున్నత్ వాల్ జమాత్ (ASWJ) యొక్క ఉన్నత స్థాయి సంస్థకు అబిద్ కావాల్సిన వాడు. అంతర్జాతీయ ఖత్మ్-ఎ-నబువత్ ఉద్యమానికి ప్రాంతీయ అధిపతి గా ఇతడు పనిచేస్తు్న్నాడు. ఒక మసీదు వెలుపల జరిగిన మెరుపుదాడిలో ఇతను హతమయ్యాడు. జైషే మహ్మద్‌లో అబిద్ కీలక వ్యక్తిగా చలామణి అవుతున్నారు. హిందువులు, యూదులు, క్రైస్తవులపై నిత్యం వ్యతిరేకత వ్యక్తం చేసేవాడు. యువతను తన ప్రసంగాలతో రాడికలైజ్ చేసి ఉగ్రవాదులుగా మార్చేవాడు. అయితే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఇస్లాంలో వివిధ గ్రూపుల మధ్య పడకపోవడం వల్లే హత్యలు జరుగుతున్నాయనే మరో ప్రచారం కూడా ఉంది.