కరోనా మహమ్మారి వైరస్ వివిధ రకాల ఉత్పరివర్తనాలుగా మార్పులు చెందుతోంది. అందులో ఒకటి బి.1.617 వేరియంట్. ఇది ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందింది. ఇండియాతో పాటుగా ప్రపంచంలోని దాదాపుగా 60 దేశాల్లో ఈ వేరియంట్ విస్తరించింది. ఈ వేరియంట్ కారణంగా దేశంలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య పెరగడానికి కూడా ఇదోక కారణం అని చెప్పొచ్చు. ఈ వేరియంట్ కేసులు ఇప్పుడు ఆస్ట్రేలియాలో పెరుగుతున్నాయి. విక్టోరియా రాష్ట్రంలో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. మెల్‌బోర్న్ నగరంలో కొత్తగా 26 కేసులు నమోదు కావడంతో పాటుగా ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న 150 ప్రదేశాలను కూడా అధికారులు గుర్తించారు. గతేడాది సెకండ్ వేవ్ తరహాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండోచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్తగా మెల్‌బోర్న్ నగరంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. వారం రోజులపాటు నగరంలో కఠినంగా లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా ఏవీ అందుబాటులో ఉండవని అధికారులు పేర్కోన్నారు.