Justin Trudeau: తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తాను తన పదవికి రాజీనమా చేస్తున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నుంచి వైదొలగాలని ఒత్తిడి పెరగడంతో ఆయనకు రాజీనామా చేయడం తప్ప వేరే అవకాశం లేకుండా పోయింది. అధికార లిబరల్ పార్టీ తదుపరి ప్రధాని పేరు ప్రకటించిన తర్వాత తాను దిగిపోనున్నట్లు వెల్లడించారు. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా రాజీనామా ప్రకటించారు.
Read Also: KTR: ఈడీ విచారణపై కేటీఆర్ రిక్వెస్ట్.. అప్పటి వరకు సమయం ఇవ్వాలని వినతి
ఈ ఏడాది అక్టోబర్ చివర నాటికి జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్స్‌కి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీలో కీలక పరిణామాలు నెలకొన్నాయి. 2015లో ట్రూడో అధికారంలోకి వచ్చారు. ఒక దశాబ్ధంగా పాలనలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని అధికారం నుంచి దించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లో అప్రూవల్ రేటింగ్స్‌లో వెనకబడి ఉన్నారు.
మరోవైపు అమెరికా, భారత్ వంటి ప్రధాన దేశాలతో గొడవలు కూడా ట్రూడోని దెబ్బతీశాయి. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదానికి వేదిక చేయడంతో పాటు గ్యాంగ్ స్టర్లకు అడ్డగా మార్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు కెనడా గత కొంత కాలంగా ‘‘హౌసింగ్ సంక్షోభం’’ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ట్రూడోపై చాలా వ్యతిరేఖత వచ్చింది. మందగించిన వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్నజీడీపీ కూడా కారణాలుగా ఉన్నాయి.