Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే చైనాలో ఓ అనూహ్య పరిణామం జరిగింది. ట్రంప్ ఫొటోలతో కూడా టీ షర్టులు మార్కెట్ లోకి వచ్చాయి. డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని రూపొందించినట్లు తయారీదారులు పేర్కొన్నారు. ఇక, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, తనపై దాడి జరిగిన తర్వాత ‘ఫైట్.. ఫైట్..’ అంటూ డొనాల్డ్ ట్రంప్ నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతరం దీనికి సంబంధించిన ఫోటోలతో చైనాలోని వ్యాపారులు టీ- షర్టులను తయారు చేసి అమ్మకాలు స్టార్ట్ చేశారు. మొదటగా అక్కడి ఈ కామర్స్ వేదిక తొబావు (అలీబాబా)లో ప్రత్యక్షం అయ్యాయి. భారీ డిమాండ్ రావడంతో.. మూడు గంటల వ్యవధిలో 2 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయని చైనాకు చెందిన ఓ మహిళా వ్యాపారి వెల్లడించారు.
Read Also: Shiva Stotram: సోమవారం ఈ స్తోత్రాలు వింటే జన్మలో ఏ కష్టాలు మీ దరికి చేరవు
అయితే, హైబీ ప్రావిన్సులో ఉన్న ఫ్యాక్టరీలో వీటికి సంబంధించి అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తయారీదారులు తెలిపారు. ఫొటోలను డౌన్లౌడ్ చేసుకొని క్షణాల్లో వాటిని ప్రింట్ చేస్తున్నామని చైనాకు చెందిన ఓ వ్యాపారి చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లు ట్రంప్ కు ఎక్కువగా ఉన్నాయని.. చైనీయుల్లోనూ ఆయన ఎంతో పాపులర్ అంటూ సదరు వ్యాపారి వెల్లడించారు. కాగా, పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా.. డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి గాయం అయింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వేగంగా స్పందించి ట్రంప్‌కు తక్షణమే రక్షణ కల్పించారు. ఈ ఘటన తర్వాత ట్రంప్ మరింత ప్రజాభిమానాన్ని దక్కించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచేందుకు 70 శాతం అవకాశాలున్నట్లు తాజాగా ఓ నివేదికలో తేలింది.