భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత ధృడమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రధాని మోడీ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత రెండు దేశాల మధ్య సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్‌పై సుంకాన్ని 50 నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ట్రంప్ నుంచి ప్రకటన రాగానే ఇరు దేశాల మధ్య ఉల్లాసభరితమైన వాతావరణం ఏర్పడింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ అయితే ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. పెట్టుబడిదారుల పంట పండింది. దాదాపు రూ.20 లక్షల కోట్ల సంపాదన జేబుల్లో పడింది.
ట్రంప్ దగ్గర సానుకూల ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికాలో పర్యటిస్తూ వాణిజ్య చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లారు. అమెరికా ఉన్నతాధికారులను కలిసి రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ను జైశంకర్ కలిశారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు.
జైశంకర్ ట్వీట్ చేస్తూ… ‘‘ఈరోజు వాషింగ్టన్ డీసీలో యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ను కలవడం సంతోషంగా ఉంది. భారతదేశం – అమెరికా ఆర్థిక భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారం పురోగతిపై ఉపయోగకరమైన చర్చ జరిగింది..’’ అని రాసుకొచ్చారు.
‘‘అధ్యక్షుడు ట్రంప్-ప్రధాన మంత్రి మోడీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో- భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్వాగతించారు.. క్వాడ్ ద్వారా ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించుకోవడానికి తమ నిబద్ధతను వ్యక్తం చేస్తూ రూబియో- జైశంకర్ తమ సమావేశాన్ని ముగించారు. ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కీలకమని వారు అంగీకరించారు.’’ అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉంటే రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపడానికి భారతదేశం కట్టుబడి ఉందని.. వాణిజ్య ఒప్పందం కింద అమెరికా నుంచి కొనుగోలు చేస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ లెవిట్ పేర్కొన్నారు.
