ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చల వేళ బాంబ్ దాడులు మాత్రం ఆగలేదు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. బందీలందరినీ విడుదల చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి హమాస్ ప్రకటించింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు. కానీ ఇజ్రాయెల్ అతిక్రమించింది. హమాస్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. తాజా దాడుల్లో ఆరుగురు పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Sanae Takaichi: జపాన్ చరిత్రలో కొత్త అధ్యయనం.. ప్రధానిగా తొలిసారి మహిళ ఎన్నిక
శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. గాజా నగరంలోని ఒక ఇంటిలో జరిగిన దాడిలో నలుగురు.. దక్షిణాన ఖాన్ యూనిస్‌లో జరిగిన మరొక దాడిలో ఇద్దరు మరణించినట్లు తెలిపారు. ట్రంప్ షరతులకు హమాస్ అంగీకరించిన తర్వాతే ఈ దాడులు జరిగినట్లుగా పేర్కొన్నారు.
ఓ శాంతి చర్చలకు హమాస్ అంగీకరించిన తరుణంలో ఇజ్రాయెల్ దాడులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ట్రంప్ ప్రకటనకు భిన్నంగా మిత్రదేశం ఇజ్రాయెల్ వ్యవహారిస్తోంది. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Israel-Hamas: తక్షణమే బందీలను విడుదల చేయండి.. హమాస్‌కు ఇజ్రాయెల్ సూచన
శాంతి ప్రణాళిను హమాస్ అంగీకరించకపోవడంతో శుక్రవారం ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రణాళికను అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించింది. అంతేకాకుండా ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ప్రతీకారంగా ఇజ్రాయెల్.. హమాస్‌పై దాడి చేసింది. నాటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ జైల్లో ఉన్న ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఒకేసారి అందరినీ విడిచి పెట్టాలని ఇజ్రాయెల్ షరతు పెట్టింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా హమాస్ బందీల విడుదలకు అంగీకారం తెల్పడంతో పాలస్తీనా ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేస్తోంది.