Israel-Hamas War: ఇజ్రాయిల్ చరిత్రలోనే అత్యంత దారుణమై దాడిని ఎదుర్కొంది. హమాస్ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయిల్ పై రాకెట్లు ద్వారా దాడులకు పాల్పడ్డారు. గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని దారుణంగా హతమర్చారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. వైమానికి దాడులతో గాజా నగరాన్ని ధ్వంసం చేస్తోంది. ఇప్పటికే గాజాను అన్ని వైపుల నుంచి ఇజ్రాయిల్ దిగ్భందించింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 1200 మంది ఇజ్రాయిలీలు ప్రాణాలు కోల్పోగా, 150 మంది హమాస్ మిలిటెంట్లకు బందీలుగా చిక్కారు. మరోవైపు ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలోని 1500 మంది వరకు చనిపోయారు.
ఇదిలా ఉంటే హమాస్ ను పూర్తిగా భూస్థాపితం చేసేందుకు ఇజ్రాయిల్ సమాయత్తం అవుతోంది. దీంతో పాటు గాజాలో ఉన్న బందీలను విడిపించేందుకు భారీ ఆపరేషన్‌కి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తర గాజాను 24 గంటల్లో ఖాళీ చేయాలని పాలస్తీనా వాసులకు వార్నింగ్ ఇచ్చింది. అయితే పాలస్తీయన్లలో చాలా మంది ఇప్పుడు దక్షిణాన ఉన్న ఈజిప్టు సరిహద్దులకు వెళ్తున్నారు. అయితే 1.2 మిలియన్ల జనాభా ఉన్నఉత్తర గాజా నుంచి వలస వెళ్లడం అసాధ్యమని ఐక్యరాజ్యసమితి చెప్పింది, ఈ ఆదేశాన్ని రద్దు చేసుకోవాలని ఇజ్రాయిల్ కి పిలుపునిచ్చింది. యూఎన్ ప్రకారం 4,23,000 మంది ఇప్పటికే తమ ఇళ్లను విచిపెట్టారని నివేదించింది.
Read Also: Rajasthan: “సిగరేట్ షేర్ చేసుకోలేదని”.. స్నేహితుడి దారుణహత్య
మరోవైపు హమాస్ ఉగ్రవాదులు ఉత్తర గాజాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ దాడుల్ని తిప్పి కొట్టేందుకు శుక్రవారం గాజా నుంచి వందలాది రాకెట్లను ఇజ్రాయిల్ వైపు ప్రయోగించారు. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో 258 మంది సైనికులను కోల్పోయినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉండే గాజా స్ట్రిప్ లో నేలపై నుంచి ఆపరేషన్ చేయడం ఇజ్రాయిల్ బలగాలకు సులువు కాదు. హమాస్ దాడిలో ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిలో 3 లక్షల మంది రిజర్వ్ ఆర్మీని సమీకరించింది. ఏ క్షణాల యుద్ధం మరిన్ని ప్రాంతాలకు పాకుతుందో అని ప్రపంచం బయపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ పైకి సిరియా, లెబనాన్ నుంచి మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్ని తిప్పికొడుతూ.. నిన్న సిరియాలోని డమాస్కస్, అలెప్పో విమానాశ్రయాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది.