Site icon NTV Telugu

COVID 19: మరో కొత్త వేరియంట్‌.. భారత్‌లో కలవరం..!

తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్లో కరోనా కొత్త వేరియంట్‌ బయటపడినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్‌ వేరియంట్‌లు BA.1, BA.2లను కొత్త వేరియంట్‌ కలిగి ఉన్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్‌ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాల్లు ఉ‍న్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత్‌కు మళ్లీ కరోనా ముప్పు పొంచి ఉందన్న వార్తలు కలవరం సృష్టిస్తున్నాయి. మహమ్మారి ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని.. మళ్లీ పంజా విసిరే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు భయాందోళన కలిగిస్తున్నాయి. దేశంలో రోజు వారీ కరోనా కేసులు 3 వేల దిగువన నమోదవుతున్నాయి. ఇకపై స్వేచ్ఛగా జీవించవచ్చని అంతా భావించారు. ప్రపంచ దేశాలను ఆర్థికంగా, ఆరోగ్యంగా తీవ్రమైన దెబ్బ తీసిన కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ త్వరగానే ముగిసింది. ఈ క్రమంలో మరోసారి రాకాసి వైరస్‌ బుసకొడుతుందన్న సంకేతాలు హడలెత్తిస్తున్నాయి.

Read Also: Vellampalli: చంద్రబాబు, పవన్ ఆర్యవైశ్య ద్రోహులు..

ఇప్పటికే చైనాలో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. 2020 మార్చి తర్వాత ఇక్కడ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. పలు నగరాల్లో పాజిటివ్‌ కేసులు పెరగడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్‌డౌన్‌ విధించారు. సోమవారం ఒక్కరోజే 2వేల 300 కేసులు రికార్డయ్యాయి. ఆదివారం 3వేల 400 కేసులు నమోదయ్యాయి. చైనాలో గడిచిన రెండేళ్లలో రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. చైనాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మరోసారి భారత్‌కు కోవిడ్‌ ముప్పు తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండియాలో ఫోర్త్‌ వేవ్‌ కచ్చితంగా ఉంటుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈసారి కరోనా ప్రభావం ఏకంగా 75 శాతం మందిపై పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో కరోనా BA.2 వేరియంట్‌తో థర్డ్‌ వేవ్‌ వచ్చింది. ఇప్పటికీ ఆ వేరియంట్‌ ఆనవాళ్లు ఉండడంతో ఫోర్త్‌ వేవ్‌కు అవకాశం ఉందని కోవిడ్‌ 19 టాస్క్‌ గ్రూప్‌ను లీడ్‌ చేస్తున్న డాక్టర్‌ ఎన్‌కే అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ చేసిన అధ్యయనాల్లోనూ భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. వారి అంచనాలతో జూలైలో ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం మొదలువుతుందని భావిస్తున్నారు.

Exit mobile version