హమాస్ అంతమే లక్ష్యంగా నూతన సంవత్సరం వేళ కూడా ఇజ్రాయెల్ వేట సాగిస్తోంది. న్యూఇయర్ వేళ జరిపిన దాడుల్లో పదుల కొద్దీ చనిపోగా.. ఇక తాజాగా జరిగిన దాడుల్లో హమాస్ అగ్ర అధికారులతో సహా 10 మంది చనిపోయారు. గాజా టెంట్ షెల్టర్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు పిల్లల సహా ఇద్దరు సీనియర్ హమాస్ పోలీసు అధికారులతో పాటు 10 మంది మరణించారని ఐడీఎఫ్ తెలిపింది. ఇందులో హమాస్ అంతర్గత భద్రతా దళాల అధిపతి ఉన్నట్లుగా పేర్కొంది.
గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలో 10 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు పిల్లలు మరియు హమాస్ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలకు చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. చనిపోయిన వారిలో గాజా పోలీసు జనరల్ డైరెక్టర్ మేజర్ జనరల్ మహమూద్ సలా, బ్రిగ్ జనరల్ హోసామ్ షాహ్వాన్ ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, నలుగురు పురుషులు ఉన్నారని నాసర్ ఆస్పత్రి తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా 24 గంటల వ్యవధిలో 60 మందికి పైగా మరణించినట్లు పాలస్తీనా అధికారులు ధృవీకరించారు.
ఆగస్టు 7, 2023న హమాస్ అమాంతంగా ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరినీ బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అగ్ర నేతలందరినీ అంతమొందించింది. వేలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ యుద్ధం సాగిస్తూనే ఉంది. అయితే తాను అధ్యక్ష పీఠంపై కూర్చునేలోపు యుద్ధం ముగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే హమాస్‌పై భీకరంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.