US-Iran Conflict: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై మళ్లీ యుద్ధం లేదా సైనిక దాడికి దిగితే ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం మునుపటిలా ఉండబోదని స్పష్టం చేశారు.
40 రోజుల యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో పరిణామాలు మారాయని గుర్తుచేశారు. హార్ముజ్ దశాబ్ధాలుగా అంతర్జాతీయ రవాణాకు కీలక మార్గం ఉందని.. ఇరాన్, ఒమన్ దేశాలు సముద్ర రవాణా భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయని అన్నారు. అయితే యుద్ధం కారణంగా పరిస్థితులు మారిపోయాయని, జలసంధి గుండా నౌకల రాకపోకలు, దాని నిర్వహణకు సంబంధించిన విధానాలు ఇకపై గతంలో మాదిరిగా ఉండకపోవచ్చని తెలిపారు. ఈ అంశాలపై ఒమన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపారు.
ఇరాన్‌పై మరోసారి సైనిక దాడికి ప్రయత్నిస్తే ముందు అమెరికా, ఇజ్రాయిల్ జాగ్రత్తగా ఆలోచించాలని అరాఘ్చీ హెచ్చరించారు. గత రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు. మరో యుద్ధం వచ్చినా, రాకున్నా ఇరాన్ విధానాల్లో మార్పు ఉండదని ఆయన అన్నారు. ఎవరికైనా తెలివి ఉంటే ఇరాన్‌పై మరో దాడికి ప్రయత్నించరని అన్నారు. ఈసారి దాడి చేసిన గతంలో కన్నా భిన్నమైన ఫలితాలు లభించవని గుర్తుంచుకోవాలని అన్నారు.
అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై మరోసారి పరిమిత సైనిక ఆపరేషన్‌ను ప్రారంభించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు దాడి జరగకపోవచ్చని, యుద్ధం త్వరలో ముగిసే అవకాశముందని కూడా ట్రంప్ అన్నారు.

