Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధి వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది.. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. ఇరు దేశాల మధ్య చర్చలకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికాకు కొత్త అణు ప్రతిపాదనను పంపినట్లు ఓ సీనియర్ ఇరాన్ అధికారి వెల్లడించారు. అయితే, అణు చర్చలు ప్రారంభం కావాలంటే ముందుగా అమెరికా తమ ఏడు డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇరాన్ పంపిన ప్రతిపాదనను అమెరికా ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు.
ఇరాన్ విధించిన ఏడు కీలక షరతులు
ఇరాన్ అగ్ర భద్రతా అధికారి మొహ్సెన్ రెజాయీ గురువారం రష్యా పర్యటన సందర్భంగా అమెరికాపై తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. అమెరికా ఏడు షరతులను అంగీకరించకపోతే హార్మూ్జ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని, చర్చలకు కూడా ముందుకు రాబోమని ఆయన హెచ్చరించినట్లు కథనాలు వెల్లడించాయి. ఇక, ఇరాన్ ప్రధానంగా అమెరికా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని కోరుతోంది. అంతేకాకుండా అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ముగించాలని, ఈ ప్రాంతం నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని పట్టుబడుతోంది. ఇవి ఇరాన్ వెల్లడించిన ప్రధాన డిమాండ్లలో కొన్ని కాగా, మొత్తం ఏడు షరతుల వివరాలు పూర్తిగా వెల్లడికాలేదు.
అణు చర్చల విషయంలో అమెరికా పట్టుదల
మరోవైపు అణు ఒప్పందానికి సంబంధించిన అంశాలను చర్చల ప్రారంభ దశలోనే చేర్చాలని అమెరికా పట్టుబడుతోంది. ఇరాన్ మాత్రం ముందుగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతోంది. దీంతో చర్చలు ఏ అంశంతో ప్రారంభించాలనే విషయంలో ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఖతార్ ద్వారా ఇరాన్ పంపిన ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తున్నప్పటికీ, వాషింగ్టన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరు దేశాల మధ్య తదుపరి చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై కూడా స్పష్టత లేదు.
మళ్లీ యుద్ధం మొదలవుతుందా?
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వ దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అయితే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, మంగళవారం మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యంతర ఎన్నికల అనంతరం సైనిక చర్యలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. మరోవైపు, అమెరికా మళ్లీ దాడులకు దిగితే గతంలో కంటే తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ సంఘర్షణ క్రమంగా లెబనాన్‌కు కూడా విస్తరించింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య పోరాటం తీవ్రరూపం దాల్చింది. అనంతరం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా ఈ ఘర్షణలో భాగమయ్యారు. సౌదీ అరేబియాలోని ఇంధన కేంద్రాలు, విమానాశ్రయాలు, ఇతర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. మొత్తంగా ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ పంపిన కొత్త అణు ప్రతిపాదన ఇరు దేశాల మధ్య చర్చలకు మార్గం సుగమం చేస్తుందా? లేక ఏడు షరతుల విషయంలో పట్టువిడుపులు లేకపోవడంతో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటుందా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి భవిష్యత్తుపై అందరి దృష్టి నెలకొంది.

