పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కలిపి ఇస్లామిక్ నాటోగా ఏర్పడ్డాయి. ఆగస్టు 7న మూడు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. శత్రువుపై మూడు దేశాలు దాడి చేయాలనదే ఉద్దేశం.
అయితే ఈ కూటమి మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే ఈ కూటమిలో చేరాలని బంగ్లాదేశ్, ఈజిప్ట్‌కు ఆహ్వానాలు అందినట్లుగా వార్తలు వచ్చాయి. కూటమిలో చేరేందుకు ఈ రెండు దేశాలు సిద్ధపడుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో అనూహ్యంగా ఇరాన్‌ను కూడా ఆహ్వానించినట్లుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. సౌదీ అరేబియాతో ఇరాన్, హౌతీయులకు దశాబ్దాలుగా ఘర్షణ వాతావరణ ఉంది. ఇటీవల కాలం అయితే సౌదీ-ఇరాన్, హతీల మధ్య తీవ్ర దాడులు కూడా జరిగాయి. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్-సౌదీ-టర్కీ కూటమిలోకి ఇరాన్ ఆహ్వానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ వార్తను ఇప్పటి వరకు ఇరాన్ ధృవీకరించలేదు. అలాగని వ్యతిరేకించలేదు. దీంతో మక్కా ఒప్పందంలో ఇరాన్ చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ఒప్పందంలో ఇరాన్ చేరితే.. అమెరికాపై అన్ని దేశాలు దాడులకు దిగుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
ఇరాన్‌కు ఆహ్వానం అందిందా?
శనివారం అల్ మయాదీన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్ పార్లమెంట్‌కు చెందిన ఖానెహ్ మెల్లత్ న్యూస్ ఏజెన్సీ అధిపతి మెహ్దీ రహీమిని ఉటంకిస్తూ ఈ కథనం ప్రచురించింది. “మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందింది. ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం” అని రహీమి చెప్పినట్లు అల్ మయాదీన్ పేర్కొంది. ప్రాంతీయ దేశాలు తమ సొంత భద్రత కోసం ఒక ప్రాంతీయ భద్రతా వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని అన్నారు. చాలా కాలంగా ఇరాన్ ఇదే విషయాన్ని కోరుకుంటోందని.. ఈ పరిణామం తమ దేశానికి విజయమని రహీమి అభిప్రాయపడ్డారు. అయితే ఇరాన్ విదేశాంగ శాఖతో పాటు సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు ఈ ఆహ్వానాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
మరిన్ని దేశాలకు అవకాశం?
ఈ ఒప్పందం రక్షణాత్మక చర్య మాత్రమేనని పాకిస్థాన్ పేర్కొంది. ఇతర దేశాలు కూడా ఈ వ్యవస్థలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దీంతో ఈ కూటమి మరింత విస్తరించే అవకాశాలపై చర్చ మొదలైంది. ఈజిప్ట్ కూడా భవిష్యత్తులో ఇందులో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సౌదీ, పాకిస్థాన్, టర్కీతో కూడిన ఆర్థిక లేదా రక్షణ వ్యవస్థలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ కూడా సూత్రప్రాయంగా ఆసక్తి చూపినట్లు సమాచారం. అయితే తమ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని బంగ్లాదేశ్ పేర్కొంది.
ఇరాన్ ఏమంటోంది?
మక్కా రక్షణ వ్యవస్థ ఏర్పాటుపై ఇరాన్ ఇప్పటివరకు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. ఆగస్టు 10న ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంపై “ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. ప్రాంతీయ దేశాలు తమ భద్రతకు సంబంధించి సొంత వ్యవస్థల అవసరాన్ని గుర్తిస్తున్నాయని ఈ పరిణామం సూచిస్తోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు మక్కా ప్యాక్ట్‌లో చేరాలని ఆహ్వానం అందిందన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఇరాన్ వాస్తవంగా ఈ కూటమిలో చేరడం మాత్రం చాలా కీలకమైన పరిణామం అవుతుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాతో టెహ్రాన్‌కు ఉన్న సంక్లిష్ట సంబంధాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం పెరుగుతుంది.
సౌదీ-ఇరాన్ మధ్య దశాబ్దాల వైరం
ఇరాన్, సౌదీ అరేబియా చాలా కాలంగా మధ్యప్రాచ్యంలో పరస్పర ప్రత్యర్థులుగా ఉన్నాయి. యెమెన్ నుంచి గల్ఫ్ ప్రాంతం వరకు పలు అంశాల్లో ఇరు దేశాల మధ్య పోటీ కొనసాగింది. యెమెన్‌లో సౌదీ అరేబియా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా.. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇటీవల హౌతీలు సౌదీ లక్ష్యాలపై దాడులను కూడా పెంచారు. అయితే 2023లో చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్, సౌదీ అరేబియా తమ దౌత్య సంబంధాలను పునరుద్ధరించాయి. కొంతకాలం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడినప్పటికీ.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ రియాద్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌ను మక్కా డిఫెన్స్ ప్యాక్ట్‌లో చేర్చాలన్న ప్రతిపాదన నిజమైతే.. అది మధ్యప్రాచ్య రాజకీయాల్లో గణనీయమైన మార్పులకు దారితీసే అవకాశముంది.

