NTV Telugu Site icon

Iran Blasts: ఖాసిం సులేమాని సమాధి వద్ద జంట పేలుళ్లు.. అమెరికా, ఇజ్రాయిల్ పనేనని ఆరోపణ..

Iran Blasts

Iran Blasts

Iran Blasts: ఇరాన్‌ రివల్యూషనరీ జనరల్ ఖాసిం సులేమాని మరణించి నాలుగేళ్లు అవుతున్న నేపథ్యంలో ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్న కార్యక్రమంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల వల్ల 95 మంది చనిపోయారు. అయితే ఈ పేలుళ్లకు అమెరికా, ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ బుధవారం నిందించింది. గాజా యుద్ధం నేపథ్యంలో మరోసారి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ఇరాన్ దాడిలో తమ ప్రమేయం లేని అమెరికా చెప్పింది. ఇదిలా ఉంటే ఈ దాడిపై ఇజ్రాయిల్ స్పందించలేదు.

దాడిలో అమెరికా హస్తం లేదని, ఇజ్రాయిల్ ప్రమేయం ఉన్నట్లు మేము నమ్మడానికి ఎలాంటి కారణం లేదని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యు మిల్లర్ అన్నారు. పేలుళ్ల గురించి అడగగా, ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారి స్పందిస్తూ.. మేము హమాస్‌తో పోరాటంపై దృష్టి పెట్టామన్నారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తన టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు, దాడిని హేయమైన నేరంగా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, జోర్డాన్, జర్మనీ మరియు ఇరాక్‌తో సహా అనేక దేశాలు పేలుళ్లను ఖండించాయి.

Read Also: Madhya Pradesh: ‘‘నీ స్థాయి ఎంత’’.. సామాన్యుడిపై కలెక్టర్ చిందులు.. తీవ్రంగా స్పందించిన సీఎం..

2020లో ఇరాక్ పర్యటనకు వెళ్లిన ఖాసి సులేమానిని బాగ్దాద్‌లో అమెరికా హతమార్చింది. డ్రోన్ దాడితో అతను ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేసింది. సులేమాని చనిపోయి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా దక్షిణ ఇరాన్ లోని అతని స్వస్థలం కెర్మాన్ లోని సాహెబ్ అల్ జమాన్ మసీదులోని అతని సమాధి వద్ద జనాలు పెద్ద సంఖ్యలు ఉన్నప్పుడు 15 నిమిషాల వ్యవధిలో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఇరాన్ అధికార వార్త సంస్థ ప్రకారం దాడిలో 103 మంది మరణించారని, 211 మంది గాయపడ్డారని తెలిపింది.