Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!

  • యూఎస్ ఎఫ్-16పై దాడి చేశామని ప్రకటించిన ఇరాన్..
  • క్షిపణి దాడితో యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండైందని ప్రకటన..
  • ఇరాన్ వాదనల్ని అవాస్తమని చెప్పిన అమెరికా సెంట్రల్ కమాండ్..
Iran War

Iran War

Iran US Tensions: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ వద్ద ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని ఇరాన్ ప్రకటించింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధ్వరంలోని తస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. శనివారం ఇరాన్ సైన్యం ప్రకటన ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్న అమెరికా ఎఫ్-16 జెట్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గుర్తించినట్లు తెలిపింది.

అమెరికా విమానాన్ని గుర్తించి, దాని కదలికల్ని నిరంతరం పర్యవేక్షించామని ఇరాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం వెల్లడించింది. విమానాన్ని టార్గెట్ చేసిన క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది. ఈ క్షిపణి యుద్ధ విమానానికి సమీపంలో పేలిందని, దీంతో విమానం దెబ్బతిన్నట్లు చెప్పింది. దీంతో పైలట్ తన మిషన్‌ను మధ్యలో నిలిపేసి, సమీపంలోని వైమానిక స్థావరంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఇరాన్ పేర్కొంది.

ఇదిలా ఉంటే, ఇరాన్ వాదనల్ని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) తోసిపుచ్చింది. ఇరాన్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా యుద్ధ విమానాలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు, అమెరికాకు చెందిన ఎంక్యూ 9 రీపర్ డ్రోన్‌లను కూడా కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 58 అమెరికా డ్రోన్లను ధ్వంసం చేశామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది.