Iran-Israel Tensions: ఇరాన్ లేదా దాని ప్రాక్సీలు రానున్న రోజుల్లో ఇజ్రాయిల్‌పై దాడికి దిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ని ఉటంకిస్తూ వైట్‌హౌజ్ వర్గాలు హెచ్చరించాయి. ‘‘ఈ వారంలోనే దాడి జరిగే అవకాశం ఉంది’’ అని వైట్‌హౌజ్ ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బీ అన్నారు. ప్రతీకార దాడిని ఊహించి ఇజ్రాయిల్ సైన్యం సంసిద్ధతను వ్యక్తి చేసిన తర్వాత ఈ హెచ్చరికలు వచ్చాయి. హమాస్ పొలికట్ చీఫ్ ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌ని హతమార్చారు.
Read Also: Vizag MLC Election: ముగిసిన విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు.. బరిలో ఇద్దరే..!
ఫువాద్‌ని మాత్రం తమ వైమానిక దాడిలో హతం చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. అయితే, హమాస్ చీఫ్ హనియే హత్యకు మాత్రం ఇజ్రాయిల్ బాధ్యత వహించలేదు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కార్యక్రమం కోసం హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్ వచ్చిన సమయంలో జరిగిన దాడిలో హత్య చేయబడ్డాడు. ఈ దాడి ఇజ్రాయిల్ చేసిందని ఇరాన్, హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి. దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆ దేశ బలగాలకు దాడికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఉద్రిక్తతల కారణంగా మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. మరోవైపు ఇజ్రాయిల్‌కి అండగా అమెరికా తన యుద్ధ నౌకల్ని పంపింది. దాడి జరిగితే ఇజ్రాయిల్‌కి మద్దతు నిలుస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే ఉద్రిక్తతల వేళ హమాస్-ఇజ్రాయిల్ మధ్య కాల్పులు విరమణకు మద్దతుగా అమెరికాతో పాటు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలు సంయుక్త ప్రకటన చేశాయి. ఇరాన్‌ని శాంతించాలని కోరాయి. ఈజిప్ట్ మరియు ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణపై చర్చలు గురువారం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇరాన్ దాడి చేస్తే, ఈ చర్చలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రతినిధి పేర్కొన్నారు.