రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల లక్షలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు. వేలాదిమంది భారతీయ విద్యార్ధులు రష్యా సరిహద్దుల్లో చిక్కుకుని పోయారు. తూర్పు ఉక్రేయిన్ లోని “సుమీ” పట్టణంలో చిక్కుకుపోయారు 500 మంది భారతీయ విద్యార్థులు. రష్యా సరిహద్దులకు కేవలం రెండు గంటల్లో చేరుకునే దూరంలో ఉంది సుమీ పట్టణం. వెనువెంటనే తమను రష్యా గుండా స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు విద్యార్థులు.
ఉక్రెయిన్ పశ్చిమ వైపునకు వెళ్లడానికి 20 గంటల ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రస్తుత అననుకూల పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు అలా ప్రయాణం చేయడం అసాధ్యం. అది క్షేమకరం కూడా కాదంటున్నారు. రష్యా క్షిపణి దాడుల్లో ధ్వంసమైన రైల్వే ట్రాకులు, లాండుమైన్లతో నిండి ఉన్న
రహదారుల పై ప్రయాణం ప్రాణాంతకం. కనీసం రాజధాని కివీ వరకు ఇదే పరిస్థితి వుంది. భయంతో బిక్కు బిక్కు మంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు భారతీయ విద్యార్ధులు.
ఇదిలా వుండగా.. ఉక్రెయిన్ పై రష్యా దాడులు దుర్మార్గం. పుతిన్ ను ప్రపంచం ఏకాకిని చేయాలంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు ముమ్మర సన్నాహాలు చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వచ్చే మూడు రోజులలో మొత్తం 26 విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఉక్రెయిన్ లో రష్యా చేసే దాడులు, యుద్ధ నేరాల పై మార్చి 7, 8 తేదీల్లో అంతర్జాతీయ న్యాయస్థానంలో బహిరంగ విచారణ జరగనుంది.