NTV Telugu Site icon

Canada: కెనడాలో హిందువుల భద్రతపై ఇండియన్ మిషన్ ఆందోళన

Canada Issue

Canada Issue

Canada: కెనడాలోని బ్రాంప్టన్‌లో గల ఆలయం వెలుపల హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. ఖలిస్థానీ మద్దతుదారుల తీరుపై ఒట్టావాలోని ఇండియన్ మిషన్ తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా హిందువుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులకు అత్యవసర సేవలు అందకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు చేసింది. కాగా, కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు హద్దులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆచార్య తెలిపారు. హిందూ భక్తులపై జరిగిన దాడి.. కెనడాలో ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు అనేక దుశ్చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

Read Also: Tapsee : అలాంటి మాట‌లతో ప్రతీ రోజు పోరాటమే చేస్తున్న : తాప్సీ

అయితే, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖలిస్థానీ మద్దతుదారుల బృందం ప్రదర్శన చేస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ సందర్భంగానే కొందరు హిందూ ఆలయం బయట ఉన్న భక్తులపై దాడి చేశారు. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. హింసాత్మక ఘటన ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి కెనడియన్‌కు తమకు నచ్చిన మతాన్ని కొనసాగించే హక్కు ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ప్రాంతీయ పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. దోషులుగా తేలిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తామని జస్టిన్ ట్రూడ్ వెల్లడించారు.