చైనీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గురువారం నుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు తెగాయి. తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి తిరిగి దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల తర్వాత వీసాలను భారత్ పునరుద్ధరించింది. రేపటి నుంచి చైనీయులకు వీసాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Bihar: ఎన్నికల ముందు బీహార్‌ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. జూలై 24 నుంచి చైనా పౌరులకు భారతదేశం పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభిస్తుందని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాలు ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి, వీసా సేవలను పునఃప్రారంభించడానికి, భారతీయ యాత్రికులు కైలాష్ మానసరోవర్‌కు ప్రయాణించడానికి అనుమతించడానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. తాజాగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని చెప్పడానికి భారత్ కీలక చర్యలు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి రెండు రోజుల పర్యటన కోసం బీజింగ్‌కు వెళ్లారు. అత్యున్నత స్థాయిలో జరిగిన సమావేశం తర్వాత ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2025 వేసవిలో కైలాష్ మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సరిహద్దు నదులకు సంబంధించిన జలసంబంధమైన డేటా భాగస్వామ్యం, ఇతర సహకారాన్ని చర్చించడానికి భారతదేశం-చైనా నిపుణుల స్థాయి యంత్రాంగం ముందస్తు సమావేశానికి కూడా వారు కట్టుబడి ఉన్నారని MEA తెలిపింది.
ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటించారు. షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల మండలి ప్రతినిధి బృందంలో భాగంగా బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా కలిశారు. అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జరిగిన ప్రత్యేక చర్చల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించుకున్నారు. చైనా పర్యటన సంతృప్తినిచ్చిందని జైశంకర్ ట్వీట్ కూడా చేశారు. మొత్తానికి ఇన్నాళ్లకు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.
