NTV Telugu Site icon

Russia-Ukraine War: రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు.. రూ.35వేల కోట్లు ఆదా చేసిన భారత్

Russia Ukraine War

Russia Ukraine War

Russia-Ukrain War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందరో సామాన్యుల జీవితాలను తలకిందులు చేసింది. ఒకరకంగా ఈ యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పలు దేశాలకు ఎగుమతులు, దిగుమతులపై ఈ యుద్ధం ప్రభావం చూపడంతో నిత్యావసర ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వల్ల భారత్ లాభపడిందని ప్రచారం జరుగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యా దగ్గర డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడంతో భారత్ రూ.35వేల కోట్లను ఆదా చేసింది. అయితే ఈ అంశాన్ని అమెరికా సహా కొన్ని దేశాలు వ్యతిరేకించినా భారత్ మాత్రం వెనక్కి తగ్గకుండా క్రూడాయిల్‌ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటూ వచ్చింది. దీంతో ఈ ఏడాది జూలై నెలలో చైనా తర్వాత భారత్‌కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా నిలిచింది. ఈ క్రమంలో సౌదీ అరేబియాను మూడో స్థానానికి నెట్టింది. అయితే ప్రస్తుతం సౌదీ అరేబియా మళ్లీ రెండో స్థానానికి చేరుకోగా రష్యా తన పూర్వస్థానం మూడో స్థానానికి పడిపోయింది.

కాగా ఉక్రెయిన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా దాడులకు తెగబడింది. దీంతో క్రూడాయిల్ ధర బ్యారెల్ 140 డాలర్లకు చేరింది. 2014 తర్వాత బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లు దాటడం ఇదే తొలిసారి. అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా సహా ఇతర దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే ఈ ఆంక్షలను భారత్ లెక్క చేయలేదు. అంతేకాకుండా తక్కువ ధరకు తమకు క్రూడాయిల్ దిగుమతి చేయాలని భారత్ డిమాండ్ చేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్ రష్యా నుంచి ఒక శాతం మాత్రమే క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునేది. యుద్ధం తర్వాత ఇది 12 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్‌- మే నెల మధ్య రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులు ఏకంగా 4.7 రెట్లు పెరిగాయి. రష్యా మన దేశానికి 35 డాలర్లకే బ్యారెల్‌ క్రూడాయిల్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌‌కు సుమారు రూ.35 వేల కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఏప్రిల్-జూలై మధ్య భారత్ 11.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును కొనుగోలు చేసింది. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం గత ఏడాది ఇదే కాలంలో 3 బిలియన్ డాలర్ల విలువైన చమురును మాత్రమే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. మార్చి నుంచి రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ పెంచడంతో 12 బిలియన్ డాలర్లకు పైగా కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి.

Show comments