India vs Pakistan: అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్‌కు మొదటి నుంచి ఉన్న అలవాటు. అయితే, చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కశ్మీర్‌ను ఉద్దేశించి పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్ ఘాటుగా బదులిచ్చారు. యూఎన్ ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న 20 సంస్థలను దాయాది దేశం పాక్ పెంచి పోషిస్తోంది అని ఆరోపించారు. అలాగే, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరులో ముందు వరుసలో ఉందని పాకిస్థాన్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పాక్ చేసే ఉగ్ర కార్యకలాపాలకు మేం బాధితులం అయ్యామని పేర్కొన్నారు. అమాయక ప్రజలపై జరిగే ఉగ్రవాద చర్యలకు సమర్థించలేమన్నారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడు అని తేడాలు ఉండవని చెప్పుకొచ్చారు. ఇలాంటి మాటలతో భద్రతా మండలి సమయాన్ని వృథా చేయొద్దని పాక్ మంత్రికి భారత ప్రతినిధి హరీస్ హితవు పలికారు.
Read Also: Komatireddy Venkat Reddy: ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ
అయితే, జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని భద్రతా మండిలిలో పర్వతనేని హరీస్ తేల్చి చెప్పారు. గత కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్నికలతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడటం గురించి తెలియజేశారు. కశ్మీర్ ప్రజల ఎంపిక చాలా క్లీయర్ గా ఉంది. పాకిస్థాన్ మాదిరిగా కాకుండా అక్కడ ప్రజాస్వామ్యం బలంగా పరిణవిల్లుతుంది అన్నారు. కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్థాన్ తన మొండి వాదనను ఆపివేయాలని హెచ్చరించారు. కశ్మీరీలు తమ ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకోవడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలని పాకిస్థాన్ కోరింది. ఇందులో భాగంగానే, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని కోరుతూ పాక్ పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.