Site icon NTV Telugu

Imran Khan: చీకటి గదిలో జీవించడానికైనా సిద్ధం.. కానీ, బానిసత్వం వద్దు

Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్తాన్‌ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ఎక్స్‌ (ట్విట్టర్)లో స్పందించిన ఆయన.. ఈ బానిసత్వాన్ని తాను అంగీకరించడానికి బదులు జైల్లో చీకటి గదిలో జీవించడానికి ఇష్టపడతానని రాసుకొచ్చారు. తన సందేశాన్ని ప్రజలకు చేరకుండా షరీఫ్ సర్కార్ అన్ని విధాలా అడ్డుకుంటోందని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని తన మద్దతుదారులకు ఆయన పిలుపునిచ్చారు.

Read Also: Sigachi Company: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. వైద్య ఖర్చులన్నీ మేమే చెల్లిస్తాం..!

ఇక, ప్రజాస్వామ్యంలో నాలుగు అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఓటు హక్కు, చట్టబద్ధమైన పాలన, నైతికత, స్వేచ్ఛాయుత మీడియా అని చెప్పుకొచ్చారు. ఇటీవల చేసిన 26వ రాజ్యాంగ సవరణ వీటన్నింటినీ నాశనం చేసేలా ఉందన్నారు. జూలై 6వ తేదీ తర్వాత.. ఈ నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలని దేశం మొత్తానికి తెలిసేలా పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌పైనా ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నియంత అధికారంలోకి వస్తే.. అతడికి ఓట్లు అవసరం లేదన్నారు. ట్రయల్‌-అండ్‌-ఎర్రర్‌ పద్ధతిలో పాలన కొనసాగిస్తాడని మండిపడ్డారు.

Read Also: Icon: అదే కథ.. మరో స్టార్ హీరో!

అలాగే, పాకిస్తాన్ కోర్టుల్లో ఎంపిక చేసిన న్యాయమూర్తులే ఉంటున్నారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే వాళ్లు శక్తిహీనులుగా మారిపోతున్నారని ఆరోపించారు. ఈ దేశంలో వాక్‌ స్వాతంత్ర్యం పూర్తిగా కనుమరుగవుతోందన్నారు. నిజాయతీ గల జర్నలిస్టులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక, ఇమ్రాన్‌ ఖాన్‌ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉంటున్నారు. బెయిల్‌ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పలు న్యాయస్థానాల్లో అతడికి చుక్కెదురు అవుతోంది.

Exit mobile version