అమెరికా-పాక్ దేశాల మధ్య మంచి మైత్రి ఉన్నది. అయితే, ఈ మైత్రి గత కొంతకాలంగా సజావుగా ఉండటంలేదు. పాక్‌లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో పాటుగా, ఆ దేశం చైనాతో బలమైన సంబందాలు కలిగి ఉండటం వలన అమెరికా పాక్ కు దూరమైందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు దశాబ్దాల కాలం క్రితం అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టి తాలిబన్, ఆల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో పాక్ సహకారంలో అమెరికా తాలిబన్‌ల ఆటకట్టించింది. ప్రస్తుతం అమెరికా-పాక్ మధ్య దూరం పెరగడం, అమెరికా-భారత్‌కు దగ్గరకావడంపై పాక్ ఓర్వలేకపోతున్నది. వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే అమెరికా పాక్‌ను వాడుకుందని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌తో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఘనీ ఉన్నంత వరకు చర్చలు జరిపేది లేదని తాలిబన్లు చెబుతున్నారని పాక్ ప్రభుత్వం పేర్కొన్నది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఇప్పటి వరకు పాక్ ప్రధానికి అమెరికా అధ్యక్షభవనం నుంచి ఎలాంటి కాల్స్ రాకపోవడంతో ఇమ్రాన్ సర్కార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
Read: విపత్కర సమయంలో కేంద్ర సహకారం భేష్: తమిళ సై