Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..

  • మా నాన్నను కాపాడండి, 1100 రోజులుగా జైలులో ఉన్నాడు..
  • అంతర్జాతీయ సమాజానికి ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఖాసిం ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి 1100 రోజులుగా జైలులోనే ఉన్నారని, ఆయన కంటి చూపు క్రమంగా క్షీణిస్తోందని, ఆయనను కలుసుకోవడానికి పాక్ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఖాసిం ఆరోపించారు. పాక్ సైన్యం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని, రాజకీయ పక్షాలను అణిచివేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు.

ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు క్షీణిస్తోందని, అతడికి తక్షణ వైద్య సహాయం అవసరం అని ఎక్స్‌లో ఖాసిం ఖాన్ పోస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఖాసిం ఖాన్, సులేమాన్ ఖాన్ ఇద్దరు బ్రిటన్‌లో ఉంటున్నారు. తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్‌‌ను 2023 ఆగస్టు 5న అరెస్ట్ చేశారు. ఆయన అప్పటి నుంచి రావల్పిండిలోని అడియాల జైలులో బందీగా ఉన్నారు. ఆయన కుడి కంటి చూపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) చెప్పింది.